Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ మంత్రి షాకూర్ రోడ్డు ప్రమాదంలో మృతి.. అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Pakistan minister Mufti Abdul Shakoor dies in road accident ksm
Author
First Published Apr 16, 2023, 2:18 PM IST

పాకిస్థాన్ మత వ్యవహారాల శాఖ మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆయన కారు మరో వాహనం ఢీకొట్టడంతో ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మంత్రి ముఫ్తీ అబ్దుల్ షాకూర్ శనివారం మారియోట్ నుంచి సెక్రటేరియట్ చౌక్ వైపు వెళుతుండగా ఆయన కారును హిలక్స్ రెవో ఢీ కొట్టిందని ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. షాకూరును హుటాహుటిన పాలీక్లినిక్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పారు. 

ప్రమాదానికి కారణమైన వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్బర్ నాసిర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి షాకూర్ తన కారును ఒంటరిగా నడుపుతున్న సమయంలో మరో వాహనాన్ని ఢీకొట్టిందని చెప్పారు. ఆయన తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఇక, ఈ రోడ్డు ప్రమాద ఘటనపై అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సమగ్ర దర్యాప్తునకు రాణా సనావుల్లా ఆదేశించారు.

ఇదిలా ఉంటే, ముఫ్తీ అబ్దుల్ షాకూర్.. మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌కు చెందిన జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (జేయూఐ-ఎఫ్) సీనియర్ నేత. జేయూఐ-ఎఫ్ పాకిస్తాన్‌లో అధికార కూటమిలో భాగంగా ఉంది. ఇక, ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోని తాజ్బీ ఖేల్ ప్రాంతంలో మంత్రి షాకూర్ అంత్యక్రియల ప్రార్థనను ఆదివారం నిర్వహించనున్నట్లు జేయూఐ-ఎఫ్ తెలిపింది.

షాకూర్ మృతిపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. షాకూర్ సైద్ధాంతిక రాజకీయ నాయకుడని అన్నారు. మంచి మానవుడిగా సమాజానికి సేవలు చేశాని ప్రశంసించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ కూడా మంత్రి షాకూర్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో సర్వమత సామరస్యానికి ఆయన సేవలందించారని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios