పాకిస్తాన్‌లో కూడా వచ్చే ఏడాదే సాధారణ ఎన్నికలు.. ప్రకటించిన ఎన్నికల సంఘం
పాకిస్తాన్‌లో వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం వెల్లడించింది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. అదే ఏడాది ఇంతకంటే ముందే అంటే జనవరి చివరి వారంలో పాకిస్తాన్‌లోనూ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ ఓ కథనంలో 2024 జనవరి చివరి వారంలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించినట్టు రిపోర్ట్ చేసింది. నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణను సమీకరించిన తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తామని వివరించింది. నవంబర్ 30వ తేదీన నియోజకవర్గాల తుది జాబితాు విడుదల చేస్తామని తెలిపింది.
ఆ తర్వాత 54 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్‌కు అవకాశం ఇస్తామని వివరించింది. అనంతరం, జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది.
Also Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా
పాకిస్తాన్ అసెంబ్లీ గడువుకు ముందే రద్దయింది. గడువు పూర్తవడానికి రోజుల ముందే ఆగస్టు 9వ తేదీన రద్దయింది. జాతీయ అసెంబ్లీ రద్దు తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు పూర్తవ్వాలి. అయితే, ఈ ఎన్నికలు వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇది వరకే అక్కడి ప్రతిపక్షాలు వాదించాయి.