పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల డేట్ ఫిక్స్.. వెల్లడించిన ఎన్నికల సంఘం..
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ దేశ ఎన్నికల సంఘం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది.
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ దేశ ఎన్నికల సంఘం సిద్దమైంది. 2024 ఫిబ్రవరి 11న పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తద్వారా పాకిస్తాన్‌లో ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది. వచ్చే ఏడాది జనవరి 29 నాటికి నియోజకవర్గాల డ్రా ప్రక్రియ పూర్తవుతుందని.. ఎన్నికలకు మార్గం సుగమం చేస్తామని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ న్యాయవాది సజీల్ స్వాతి సుప్రీం కోర్టుకు తెలిపారు.
జాతీయ అసెంబ్లీ, ప్రావిన్షియల్ శాసనసభలను రద్దు చేసిన తర్వాత 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పాకిస్తాన్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ), పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, ఇతరులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) ఖాజీ ఫేజ్ ఇసా, జస్టిస్ అమీన్-ఉద్-దిన్ ఖాన్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈరోజు విచారణ సందర్బంగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు పాక్ మీడియా రిపోర్టు చేసింది. ఇదిలావుండగా.. నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్ ఆవశ్యకతను ఎన్నికల వాయిదాకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం కారణమని పేర్కొంది.
ఇక, ఇందుకు సంబంధించి గత విచారణ సందర్భంగా.. 90 రోజుల్లోగా ఎన్నికలకు సంబంధించిన టైమ్‌లైన్‌పై ఇన్‌పుట్‌ను అందించాలని పాక్ ఎన్నికలసంఘం, ఫెడరల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఎన్నికలను కోరుకుంటారని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) ఖాజీ ఫేజ్ ఇసా ఉద్ఘాటించారు. విచారణ సందర్భంగా పీటీఐ తరపు న్యాయవాది, బారిస్టర్ అలీ జాఫర్.. 90 రోజుల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని వాదించారు. ఇక, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు.