ఆర్టికల్ 370 రద్దును అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇరుకున పెట్టాలని చూస్తోన్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి అంతగా మద్ధతు లభించడం లేదు.

కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద రచ్చ అవుతుందని పాక్ భావించినప్పటికీ.. ఎటువంటి స్పందనలు రాకపోవడం దాయాదీ దేశాన్ని అసంతృప్తికి గురిచేసింది.

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి అత్యంత శక్తివంతమైన పీ5 దేశాల రాయబారులకు విషయాన్ని తెలియజేసింది భారత్. వీటిలో ఒక్క చైనా మినహా మిగిలిన అన్ని దేశాలు ఎటువంటి ప్రకటనా చేయలేదు.

లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా తమ సార్వభౌమాధికారాన్ని దిక్కరించే పని భారత్ చేస్తోందని చైనా పేర్కొంది. వెంటనే స్పందించిన విదేశాంగశాఖ.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని తేల్చి చెప్పింది.

ఇక పాక్‌తో ఉన్న పలు ద్వైపాక్షిక సంబంధాలు రీత్యా టర్కీ మాత్రం కశ్మీర్‌ విషయంలో భారత్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇస్లాం దేశాల్లో అత్యంత శక్తివంతమైన యూఏఈ ఈ విషయంలో భారత్‌కు మద్ధతు ప్రకటించింది.

ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూకాశ్మీర్‌లో సామాజిక, ఆర్ధిక పరిస్ధితులు మెరుగవుతాయని యూఏఈ రాయబారి పేర్కొన్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా సైతం దాయాది దేశానికి షాకిచ్చింది.

అది భారత అంతర్గత వ్యవహారమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతినిధి సోషల్ మీడియాలో తెలిపారు. చైనాను కట్టడి చేయడానికి భారత్ సాయం తప్పనిసరి కావడంతో పాటు... ఇండియాతో దౌత్య, వ్యాపార సంబంధాలను దెబ్బతీసుకోవడానికి అమెరికా అంత సిద్ధంగా లేదు.

యూరోపియన్ యూనియన్‌లోని నెదర్లాండ్స్ నేరుగా భారత్‌కు మద్ధతు ప్రకటిస్తూ.. పాక్‌ను ఉగ్రదేశంగా అభివర్ణించలేదు. అటు శ్రీలంక సైతం పాకిస్తాన్‌కు మద్ధతు తెలపలేదు. మరోపక్క ఫ్రాన్స్, రష్యాల నుంచి భారత్ భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుండటంతో వ్యాపార సంబంధాల రీత్యా ఈ రెండు అగ్రరాజ్యాలు పూర్తిగా మౌనం పాటించాయి.

ఐక్యరాజ్యసమితి సైతం ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు పాకిస్తాన్‌ బుధవారం ప్రకటించింది.