పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వాల తీరు పొసగడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో వీరిద్దరూ ఒకే వేదికపై ఒక రోజు తేడాతో విరుద్ధ వైఖరులను ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ రష్యా వైపు మొగ్గు చూపుతుండగా, ఆర్మీ చీఫ్ బజ్వా మాత్రం అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య దేశాలు పాకిస్తాన్ ప్రయోజనాలకు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అత్యంత విషాదం అని అన్నారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీ గండం దాదాపు దగ్గర పడింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావేద్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని తోసిరాజని విదేశాంగ వ్యవహారాలపై స్పందించారు. ఏకంగా ప్రధాని వైఖరినే తప్పుపట్టారు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ మెల్లి మెల్లిగా రష్యా వైపు జరుగుతుండగా, ఆర్మీ చీఫ్ బజ్వా మాత్రం అమెరికా, ఐరోపా దేశాలవైపు తూకం వేశారు. అదీ ఒక రోజు తేడాతో ఒకే వేదికపై ఈ విరుద్ధ భావాలు ప్రకటించడం మరింత శోచనీయం.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలోనే ఉన్నారు. అవి అద్భుత క్షణాలుగా ఆయన వర్ణించారు. అనంతరం పర్యటన ముగిసిన తర్వాత కూడా ఆయన ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించలేదు. దాని మిత్రపక్షం చైనా దారిలోనే అది కూడా అడుగులు వేసింది. కానీ, తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ వేదికపై మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మహా విషాదం అని పేర్కొన్నారు. రష్యా వెంటనే ఆ దాడులను ఆపేయాలని డిమాండ్ చేశారు. అదే సందర్భంలో అమెరికాతో పాకిస్తాన్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాలను మెచ్చుకున్నారు. అలాగే, యూకే, యూరోపియన్ యూనియన్‌లూ పాకిస్తాన్ ప్రయోజనాలకు ఎంత కీలకమైనవో ఆయన ఏకరువు పెట్టారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు పరస్పర విరుద్ధమైనవిగా కనిపిస్తాయి.

అదే వేదికగాపై ఇమ్రాన్ ఖాన్ ఒక రోజ ముందు మాట్లాడుతూ, ఫిబ్రవరి 24వ తేదీన అంటే ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడి ప్రారంభించినప్పుడు తాను రష్యా పర్యటనలో ఉండటం ఓ పవర్‌ఫుల్ కంట్రీకి నచ్చలేదని పరోక్షంగా అమెరికాను విమర్శించారు. అంతేకాదు, ఈ సందర్భంలో ఆయన భారత్‌పైనా ప్రశంసలు కురిపించారు. పశ్చిమ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ నిర్భయంగా చమురును దిగుమతి చేసుకుంటున్నదని, ఆ దేశ స్వతంత్ర విదేశాంగ విధానం గొప్పదని పొగిడారు. కానీ, పాకిస్తాన్ విదేశాంగ విధానం మాత్రం ఇంకా దాని కాళ్లపై అది నిలబడలేకపోతున్నదని స్వదేశంపైనే విమర్శలు చేశారు. తాను ఆ రోజు బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి భారత్‌పై ఇచ్చిన స్టేట్‌మెంట్ చదివారని, అందులో భారత్‌ను వారు ఏమీ అనలేదని, ఎందుకంటే భారత్‌కు స్వతంత్రమైన విదేశాంగ విధానం ఉన్నదని పేర్కొన్నారు. అందుకు తాను పశ్చిమ దేశాలను తప్పుపట్టడం లేదని, కానీ, పాకిస్తాన్ ఎక్కడ ఉన్నదని అడుగుతున్నారని వివరించారు. గురువారం ఆయన పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా ఓ బెదిరింపు మెమో పంపిందని, ఇది తన
ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. 

తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఇందుకు విరుద్ధ వైఖరిని అదే వేదిక పై నుంచి వెల్లడించారు. నిజానికి పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ రాజకీయం ఎదిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ఆ దేశ ఆర్మీ అండదండలు ఉన్నాయి. కానీ, గతేడాది అక్టోబర్‌లో ఆ దేశ నిఘా విభాగం ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకంలో జాప్యం వహించడం విషయంలో ఇమ్రాన్ ఖాన్‌తో ఆ దేశ ఆర్మీకి చెడినట్టు తెలుస్తున్నది. అప్పటి నుంచి వీరి మధ్య దూరం పెరిగింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. ఆర్మీ దానిపై తటస్థ వైఖరినే ప్రదర్శించింది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా ఈ రోజు మాట్లాడుతూ, భారత్‌తోనూ అన్ని వివాదాలు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపు ఇచ్చారు. కశ్మీర్ సహా ఇతర వివాదాలు అన్నీ చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్నారు.