Asianet News TeluguAsianet News Telugu

నిజమైన భారత్ మాట: కరాచీలోనే దావూద్ ఇబ్రహీం.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాకిస్తాన్

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది.

Pakistan Admits Dawood Ibrahim Address As Karachi
Author
Islamabad, First Published Aug 22, 2020, 9:14 PM IST

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాను ఆ దేశం 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది.

ఈ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ ఉండటంతో ఇన్నాళ్లు దాచిన నిజం బయటకొచ్చింది. కాగా ప్యారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను 2018లో గ్రే లిస్ట్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. 2019 చివరి నాటికి ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే కరోనా నేపథ్యంలో ఈ గడువును ఎఫ్ఏటీఎఫ్‌ పొడిగించింది. ఈ క్రమంలో గ్రే లిస్ట్‌ ముప్పు నుంచి తప్పించుకునేందుకు గాను దాయాది దేశం ఈ నెల 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది.

అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థలు సహా వాటి నేతల ఆర్ధిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. వారి స్థిర, చరాస్తులను సీజ్ చేసి, వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక ఉగ్రవాదుల లిస్టులో దావూద్ ఇబ్రహీంతో పాటు జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయిద్, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ పేర్లు ఉన్నాయి.

కాగా, ఈ నోటిఫికేషన్ల ప్రకారం దావూద్ కరాచీలో తలదాచుకుంటున్నట్లు తేలింది. అయితే ఈ విషయాన్ని భారత్ కొన్నేళ్లుగా చెబుతూనే ఉంది. మరోవైపు గ్రే లిస్ట్‌లో ఉంటే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్ధిక సాయం పొందడం పాకిస్తాన్‌కు కష్టమవుతోంది.

అసలే ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు దాయాది దేశం ఈ హడావిడి చర్యలు చేపట్టినట్లుగా  తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios