Pakistan Political Crisis 2022: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ కు దిమ్మ తిరిగిపోయే.. షాక్ ఇచ్చింది ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ. అధికారికంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలిగించినట్టు క్యాబినెట్ సెక్రటరీ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి కాదని, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందని క్యాబినెట్ సెక్రటరీ ప్రకటనలో స్పష్టం చేసింది.
Pakistan Political Crisis 2022: పొరుగు దేశం పాకిస్థాన్.. ఆ దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతారనీ, ఓటింగ్ జరిపి ప్రధాని పదవీ నుంచి.. ఇమ్రాన్ ఖాన్ ను తొలగిస్తారని అందరూ భావించారు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి.. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.
అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సిఫార్సు చేస్తూ దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ కు దిమ్మ తిరిగిపోయే.. షాక్ ఇచ్చింది ఆ దేశ క్యాబినెట్ సెక్రటరీ. అధికారికంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఇమ్రాన్ ఖాన్ ను తొలిగించినట్టు క్యాబినెట్ సెక్రటరీ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన కొన్ని గంటల్లో ఇలాంటి ప్రకటన గమనార్హం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(1), ఆర్టికల్ 58(1) ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్యాబినేట్ సెక్రటరీ తెలిపింది. ఇకపై ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి కాదని, దేశంలోని బ్యూరోక్రసీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తోందని క్యాబినెట్ సెక్రటరీ నోట్ స్పష్టం చేసింది.
ఇమ్రాన్ ఖాను ను అధికారికంగా కార్యాలయం నుండి తొలగించబడటంతో... తాత్కాలిక/సంరక్షక ప్రభుత్వం ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలను నిర్వహించవలసి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించలేదని స్థానిక మీడియా సమాచారం. రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని సాధారణంగా తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమిస్తారు. అయితే దిగువ సభ రద్దు కారణంగా అతను ఇకపై పదవిలో ఉండడు.
పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 ప్రకారం, ఒకసారి నోటిఫికేషన్ జారీ చేయబడితే.. తాత్కాలిక ప్రధానమంత్రిని నియమించే వరకు ఇమ్రాన్ ఖాన్ 15 రోజుల పాటు ప్రధానిగా కొనసాగవచ్చు. ఇమ్రాన్ ఖాన్ 15 రోజుల పాటు ప్రధానిగా కొనసాగినప్పటికీ, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ ప్రధానిగా తన బాధ్యతలను కొనసాగించడానికి ఖాన్‌కు అనధికారికంగా ప్రెసిడెంట్ అనుమతి ఇచ్చారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారాన్ని పాక్ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపకపోవడాన్ని ప్రశ్నిస్తూ .. ప్రభుత్వం రాజ్యంగాన్ని ఉల్లంఘించిందని విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పాక్ నేషనల్ అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలన్నీ గమనించామని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ సమయంలోనే రాజీనామా చేసిన పాక్ అటర్నీ జనరల్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంగళవారం కోర్టు విచారణకు రావాలని కోరింది. ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతల విషయం సైన్యం చూసుకోవాలని కోరింది. అన్ని రాజకీయ పక్షాలు రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించింది. నోటీసులు కూడా జారీ చేసింది
పాక్ నేషనల్ అసెంబ్లీలో 342 మంది సభ్యులుండగా.. ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ పీటీఐకి 155 మంది సభ్యులు, పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతుతో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. అసలు మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే.. 172 సీట్లు కావాలి. ప్రతిపక్ష పీఎంఎల్‌ఎన్‌కు 84, పీపీపీ 56, ఎంఎంఏకు 15 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరందరి బలం 177. మ్యాజిక్ నెంబర్‌ను మించి ప్రతిపక్షాల వద్ద బలముంది.
