అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమలాహ్యారిస్ గౌరవార్థం పద్మాలక్ష్మి దక్షిణ భారతదేశానికి చెందిన ఓ వంటకాన్ని వండి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

అమెరికా మొదటి మహిళగా దక్షిణాసియా మూలాలున్న మొదటి వ్యక్తి, నల్లజాతీయురాలు, భారతసంతతికి చెందిన కమలాహ్యారీస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీసులో అడుగుపెట్టబోతున్న తరుణం దగ్గరపడుతోంది. అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవీ స్వీకారమహోత్సవం కోసం అమెరికన్లు గంటలు లెక్కిస్తున్నారు. 

కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్ లాగే, పద్మ లక్ష్మి కూడా చెన్నైలోనే పుట్టారు. తన  నాలుగేళ్ల వయసులో యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చారు. ఆ తరువాత  రచయితగా, మోడల్ గా,  ఎమ్మీ-అవార్డు గెలుచుకున్న వంటల షో టాప్ చెఫ్ కుహోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

పద్మాలక్ష్మి మాట్లాడుతూ.. మన కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గౌరవార్థం, నేను ఈ రోజు ఒక ప్రముఖ దక్షిణ భారతీయ వంటకాన్ని తయారు చేస్తున్నాను, అది ఆమెకు ఇష్టమైనదని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన డిష్ అంటూ ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రాం లో పోస్ట్ చేసింది. 

అది చింతపండు పులిహోర. 12 నిమిషాల ఈ వీడియోలో చింతపండు, బియ్యం తో పులిహోర చేయడాన్ని ఆమె చక్కగా వివరించింది. భారతీయ సంప్రదాయ పద్దతిలో అదెలా చేస్తారో.. అమెరికన్లు తమకు దొరికే వాటితో ప్రత్యామ్నాయంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించింది. 

ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా చూశారు. చాలామంది కామెంట్స్ చేశారు. ‘వింటుంటేనే నోరూరిపోతుంది. రుచి అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వంటకం గురించి ఎప్పుడూ వినలేదు. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఓ వ్యక్తి రాయగా... ఇది స్టుపిడ్ విషయం అని నాకు తెలుసు.. కానీ ఇలాంటిది మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ మీడియాలో కనిపిస్తుందేమో అని చూస్తున్నా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. 

కమలా హారిస్ తల్లి, శ్యామల గోపాలన్, చెన్నైలో జన్మించారు. ఆమె 19 సంవత్సరాల వయస్సులో డాక్టరేట్ చేయడానికి అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఒకసారి, మిసెస్ హారిస్ దక్షిణ భారతీయ వంటకాల మీద తనకున్న ప్రేమను బయటపెట్టారు.

"దక్షిణ భారతదేశపు ఆహారపు అలవాట్లు మాకున్నాయి. భోజనంలో ఎక్కువగా పెరుగు, బియ్యం, పప్పు, బంగాళాదుంప కూర, ఇడ్లీ" తినేవాళ్ల అని 2019లో మిండి కాలింగ్ అనే దక్షిణ భారత మూలాలతో ఉన్న మరో అమెరికన్ తో ఆమె పంచుకున్నారు.

గతేడాది ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు, తన సోదరికి తల్లి చేసే ఇడ్లీలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తన ఫేవరేట్ ఫుడ్స్ లో ఇడ్లీ కూడా ఒకటని హారీస్ చెప్పుకొచ్చారు. 

"మేము పెరిగి పెద్దయ్యాక, ఓ సారి మా అమ్మ నన్ను, నా చెల్లిని తాను పుట్టిపెరిగిన మద్రాస్ కు తీసుకువెళ్లింది. ఎందుకంటే మా మూలాలు ఏంటో మాకు తెలియాలని ఆమె పూర్వీకుల గురించి అర్థం చేసుకోవాలని అనుకునేది. ఇడ్లీ మీద మాకు ప్రేమ కలిగేలా చేయాలనుకునేది... అంటూ చెప్పుకొచ్చారు.