ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. అయితే కొన్ని చోట్ల వ్యాక్సిన వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. 

వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో సుమారు 12 వేల మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. గతేడాది డిసెంబర్‌ 19న ఇజ్రాయెల్‌లో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభించారు. వృద్ధులకు, హెల్త్‌ రిస్క్‌ ఎక్కువ ఉన్నవారికి, అత్యవసర సిబ్బందికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

వీరిలో మొత్తం 1,89,000 మందికి మరో సారి కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా, 12,400 మందికి అనగా 6.6 శాతం జనాభాకి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పాజిటివ్‌ వచ్చిన వారిలో 69 మందికి వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ కూడా ఇచ్చారు. 

ఈ క్రమంలో తాము ఊహించిన దాని కన్నా ఫైజర్‌ వ్యాక్సిన్‌ సామార్థ్యం చాలా తక్కువగా ఉందని నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఆన్‌ పాండమిక్‌ అభిప్రాయపడ్డారు. 

ఇక నెల క్రితం ఇక్కడ తొమ్మిది మిలియన్ల మంది నివాసితులలో 2.2 మిలియన్లకు పైగా టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్టెయిన్ తెలిపారు. వీరిలో 3.5 జనాభాకి సెకండ్‌ డోస్‌ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ, వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌ కాలేదు.

దాంతో ప్రస్తుతం దేశంలో మూడో సారి లాక్‌డౌన్‌ విధించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌లో అర మిలియన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి.. 4,005 మంది మరణించారు.