ప్రపంచంలో రోజూ లక్ష కరోనా కేసులు: డబ్ల్యుహెచ్ఓ ఆందోళన
ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు వారాలుగా రోజూ లక్ష కేసులు నమోదౌతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రకటించారు.
జెనీవా:ప్రపంచంలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు వారాలుగా రోజూ లక్ష కేసులు నమోదౌతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రకటించారు.
ప్రపంచంలో కరోనా కేసులు 81.07 లక్షలకు చేరుకొన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మీడియాతో మాట్లాడారు. అమెరికా,, దక్షిణాసియాలో పరిస్థితి మరింత దిగజారుతోందని ఆయన ప్రకటించారు. కరోనా నియంత్రించిన దేశాలు కూడ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగా లక్ష కరోనా కేసులు నమోదు కావడానికి రెండు నెలలు పట్టింది. కానీ, ఇప్పుడు లక్ష కేసులు రోజులోనే నమోదౌతున్నాయన్నారు. ఇది ప్రమాదకరమైన సంకేతంగా ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నెలల పాటు ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాని బీజింగ్ లో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.
చైనాలో కరోనా కేసులు నమోదుకావడంపై కారణాలను విశ్లేషిస్తున్నామన్నారు. ఇండియాలో తొలి కరోనా కేసు ఈ ఏడాది జనవరి 30న నమోదైంది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పక్షం రోజుల వ్యవధిలోనే లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ 2 నాటికి ఇండియాలో కరోనా కేసులు రెండు లక్షలను దాటాయి.మే 13 నాటికి ఇండియాలో కరోనా కేసులు లక్షకు చేరుకొన్న విషయం తెలిసిందే.
ప్రతి రోజూ సగటున పదివేల కరోనా కేసులు నమోదౌతున్నాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇండియాలో కూడ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా సోకిన రోగుల రికవరీ కూడ పెరిగినట్టుగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.