India Pakistan conflict: భారత్-పాక్ ఉద్రిక్తతలలు మరింత పెరిగాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత మధ్య భారత్ పాక్ వార్ లోకి అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ వచ్చారు. ఘర్షణలు ఆపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
India Pakistan conflict: భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. "ఇలాంటి ప్రతీకార చర్యల తర్వాత ఆగాల్సిన అవసరం ఉంది" అంటూ ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆయన కోరారు. "నాకు రెండు దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని నేను ఆశిస్తున్నాను. అవసరమైతే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను" అని ట్రాప్ తెలిపారు.
వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. "ఇది దురదృష్టకరం. డికేడ్స్ కాదు, శతాబ్దాలనుంచి వీళ్ల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఆగితే మంచిదే" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి స్పందన ఇది.
ఆపరేషన్ సింధూర్ తో భారత్ త్రివిధ దళాలు.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడులు పహల్గాం లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటూ పాక్ తో అన్ని సంబంధాలు కట్ చేసుకుంది. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ లో ఉగ్రవాదులపై దాడులు చేసింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇప్పుడు ప్రతీకార చర్యలు పూర్తయ్యాయి. అలా కొనసాగితే ఇంకా ప్రమాదం ఉంటుంది. కనుక వీళ్లిద్దరూ ఆగాలి" అన్నారు. "వీళ్లిద్దరికీ నేను బాగా తెలుసు. మేము ఇరుదేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. అవసరమైతే వీరికి సాయం చేస్తాను" అని కామెంట్స్ చేశారు. ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో "ఈ పరిణామాలపై మేము అవగాహన కలిగి ఉన్నాం. ఇది ఒక అభివృద్ధిలో ఉన్న పరిస్థితి. మేము దీనిని గమనిస్తున్నాం" అని పేర్కొంది.
అయితే, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో, ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్‌తో మాట్లాడారు. అనంతరం రుబియో భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించేందుకు నేతల మధ్య ప్రత్యక్ష చర్చలు తిరిగి ప్రారంభించాలని సూచించారు.
అంతేకాక, పాకిస్తాన్‌కి ప్రయాణించే తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యుద్ధ ప్రమాదం, ఉగ్రవాదం కారణంగా అక్కడికి వెళ్లకూడదని పేర్కొంది.