ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. కిమ్ ఆరోగ్యంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.

కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయని, దీనిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఐరాస వెల్లడించింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారానే తమకు ఈ సమాచారం అందిందని ఆ దేశ ప్రతినిధుల నుంచి తమకు వర్తమానం లేదని స్పష్టం చేసింది.

కిమ్ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఐరాస తెలిపింది. కాగా ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి.

ఆర్యోగం విషమంగా వుందని పలు పత్రికలు సైతం ప్రచురించాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు ఉత్తర కొరియా అధికారికంగా ఎలాంటి ఖండన కూడా చేయకపోవడం గమనార్హం. దక్షిణ కొరియా మాత్రం కిమ్ బాగానే ఉన్నాడంటూ చెప్పింది. అయితే.. కిమ్ బయటకు ఎక్కడా కనిపించకపోవడంతో.. ఆయన ఆరోగ్యం సరిగాలేదనే అందరూ అభిప్రాయపడుతున్నారు. తర్వాతి అధ్యక్షుడి కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి. కాగా.. దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

తాజాగా మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏప్రిల్‌ 15 నాటి కార్యక్రమానికి హాజరుకాకపోయి ఉండవచ్చని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.