Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్‌తో రిస్కు చాలా ఎక్కువ.. ప్రపంచవ్యాప్తంగా వారంలో 49.9 లక్షల కేసులు: డబ్ల్యూహెచ్‌వో

మొత్తం ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని గుప్పెట్లోకి తీసుకునే ముప్పు ఉన్నదని వివరించింది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే అనేక హాట్‌స్పాట్లకు కారణమై వణికిస్తున్నదని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో రిస్కు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒక్క వారంలోనే 11 శాతం కేసులు పెరిగాయని పేర్కొంది.
 

omicron still posing high risk says WHO
Author
New Delhi, First Published Dec 29, 2021, 7:29 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌(Omicron) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నది. అమెరికా, యూరప్ దేశాల్లో ఊపిరిసల్పనివ్వట్లేదు. కొన్ని యూరప్ దేశాల్లోనైతే.. ఆరోగ్య వ్యవస్థకు సవాల్ విసురుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌తో ఎక్కువ ముప్పే(High Risk) పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని గుప్పెట్లోకి తీసుకునే ముప్పు ఉన్నదని వివరించింది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే అనేక హాట్‌స్పాట్లకు కారణమై వణికిస్తున్నదని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన వారం వివరాలను అంతకు ముందటి వారం వివరాలతో పోల్చుతూ ఒమిక్రాన్ ముప్పు ఇంకా పొంచే ఉన్నదని తెలిపింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ సులువుగా పెరిగిపోతుందని, రెండు లేదా మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతాయని వివరించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒక్క వారంలోనే 11 శాతం కేసులు పెరిగాయని పేర్కొంది. అమెరికా దేశాల్లో కేసులు భారీగా పెరిగాయని వివరించింది. డిసెంబర్ 20 నుంచి 26వ తేదీల్లో అంటే వారం రోజుల్లో కొత్తగా 49.9 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో ఐరోపా దేశాల్లోనే సగం కేసులు రిపోర్ట్ అయ్యాయని వివరించింది. ఇక్కడ 28.4 లక్షల  కేసులు నమోదై.. గత వారం కంటే కొత్త కేసుల్లో మూడు శాతం పెరుగుదల కనిపించింది. కాగా, ఇక్కడే అత్యధిక ఇన్ఫెక్షన్ రేట్ ఉన్నది. ప్రతి లక్ష మందికి 304.6 కొత్త కేసులు నమోదవుతున్నాయని వివరించింది. కాగా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో కొత్త కేసులు 39 శాతం పెరిగాయి. ఇక్కడ కొత్తగా 14.8 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఒక్క అమెరికా(యూఎస్)లనే 11.8 లక్షల కేసులు కొత్తగా రిపోర్ట్ అయ్యాయి. ఇక్కడ గత వారంతో పోల్చితే 34 శాతం పెరుగుదల ఉన్నది. కాగా, ఆఫ్రికాలో ఏడు శాతం పెరిగి కొత్తగా 2.75 లక్షలు కేసులు రిపోర్ట్ అయ్యాయి.

Also Read: ఏపీలోనూ ఒమిక్రాన్ అలజడి.. ఒకేసారి 10 కొత్త కేసులు, 16కి చేరిన సంఖ్య

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా కనిపించిన దక్షిణాఫ్రికాలో మాత్రం కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. కాగా, యూకే, డెన్మార్క్‌లలోనూ ఈ తగ్గుదల కనిపించిందని పేర్కొంది. కాగా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రాబల్యంగా ఉన్నదని తెలిపింది. కాగా, కొన్ని అధ్యయనాలు ఈ వేరియంట్ కారణంగా స్వల్ప తీవ్రతతో కొవిడ్‌-19 సోకుతున్నదని వివరించింది. 

బ్రిటన్, దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌లలో ఇన్ఫెక్షన్‌లు  భారీగా రిపోర్ట్ అవుతున్నాయని వివరించింది. ఒకరి నుంచి ఇతరులకు సోకే రేటు ఇక్కడ అధికమని తెలిపింది. అయితే, డెల్టా వేరియంట్‌తో పోల్చితే.. ఇక్కడ కరోనా సోకి హాస్పిటల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నదని వివరించింది. అయితే, ఇలాంటి అధ్యయనాలు ఎన్ని ఉన్నా.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా పెరిగితే.. చాలా మంది హాస్పిటల్స్‌లో చేరే ముప్పు ఉందని తెలిపింది. ఎక్కువ మంది హాస్పిటళ్లలో చేరడమే కాదు.. వ్యాక్సిన్ తీసుకోని వారికీ అధిక ముప్పు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని, ఇతర అత్యవసర సేవలకూ ఆటంకం కలిగిస్తుందని వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios