రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడు  రిచర్డ్ ఓవర్టన్ ఇటీవల అమెరికాలో కన్నుమూశారు. గత కొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూశారు.

అమెరికాలోనే అత్యంత పెద్ద వయసున్న వ్యక్తి కావడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కావడంతో రిచర్డ్ ఓవర్టన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2013లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను వైట్ హౌస్‌లో కలుసుకున్నారు రిచర్డ్. ఆయన 111వ పుట్టిన రోజు సందర్భంగా ఆస్టిన్‌లో ఆయన నివాసం ఉన్న వీధికి రిచర్డ్ ఓవర్టన్ ఎవెన్యూ అనే పేరును కూడా పెట్టారు. 

ఓవర్టర్ 11 మే, 1906లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 1942-45 మధ్య కాలంలో ఆయన ఆర్మీకి సేవలందించారు. ఆర్మీ నుంచి రిటైరయిన తరువాత ఓ ఫర్నీచర్ షాపులో పని చేసిన ఓవర్టన్... ఆ తరువాత ఆస్టిన్ రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరించారు. . రెండు పెళ్లిళ్లు చేసుకున్న రిచర్డ్ ఓవర్టన్‌కు పిల్లలు లేరు. జెర్నటాలజీ రీసెర్చ్ గ్రూప్  సర్వే ప్రకారం... ప్రపంచంలో అతి ఎక్కువ వయసు గల వ్యక్తిగా జపాన్‌కు చెందిన మసాజు నొనంకా గుర్తింపు సాధించగా... రెండో అతిపెద్ద వయస్కుడిగా అమెరికాకు చెందిన రిచర్ట్ ఓవర్టన్ రికార్డ్ సృష్టించాడు.