గాజా మీద న్యూక్లియర్ బాంబ్: ఇజ్రాయెల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. పీఎం నెతన్యాహు ఏమన్నారంటే?
గాజా మీద న్యూక్లియర్ బాంబుల వేసే ఆప్షన్ కూడా ఇజ్రాయెల్ వద్ద ఉన్నదని మంత్రి ఎలియాహు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. గాజా పౌరులను నాజీలతో పోలుస్తూ.. అక్కడున్నవారంతా హమాస్‌తో సంబంధమున్నవాళ్లేనని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలను పీఎం బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ మంత్రి అమిచై ఎలియాహు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హమాస్ టెర్రరిస్టు గ్రూప్‌తో జరుగుతున్న యుద్ధంపై ఆయన ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గాజా స్ట్రిప్ పై యుద్ధానికి సంబంధించి న్యూక్లియర్ బాంబ్ వేసే ఆప్షన్ కూడా ఇజ్రాయెల్‌కు ఉన్నదని కామెంట్ చేశాడు. మానవతా సహాయం కోసం విరామాన్నీ ఆయన తిరస్కరించాడు. గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో సంబంధం లేని వారెవరూ లేరని పేర్కొని.. అక్కడి వారంతా శత్రువులే అనే అర్థాన్ని ధ్వనించాడు. గాజా పౌరులను నాజీలతో పోల్చాడు. గాజా స్ట్రిప్‌ను మొత్తంగా స్వాధీనం చేసుకుంటే పాలస్తీనియన్ల పరిస్థితి ఏమిటీ? వారు ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నకు సమాధానంగా వారు ఐర్లాండ్ లేదా ఏ ఎడారిలోకి వెళ్లిపోతారని అన్నాడు. లేదంటే వారి సమస్యకు పరిష్కారాన్ని వారే కనుక్కుంటారని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు.
న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడిన మంత్రి ఎలియాహును పీఎం నెతన్యాహూ తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు వాస్తవ దూరం అని, ఇజ్రాయెల్, ఐడీఎఫ్ అంతర్జాతీయ చట్టాలకు లోబడి, అమాయకులకు నష్టం వాటిల్లకుండా నడుచుకుంటున్నదని వివరించారు. తమ విజయం కోసం ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగిస్తామని తెలిపారు.
ఎలియాహు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలూ తీవ్రంగా విమర్శలు సంధించారు. బాధ్యతారాహిత్య మంత్రిని వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో పోరాటం.. ‘తక్షణం అమలు చేయాలి’
అనంతరం, సదరు మంత్రి ఎలియాహు నష్ట నివారణ చర్యలకు పూనుకున్నాడు. తన వ్యాఖ్యాలన్నీ ఉపమానంగా తీసుకోవాలని, తీవ్రవాదాన్ని కచ్చితంగా తీవ్రంగా తీసుకుని దీటుగా ఎదుర్కోవాల్సిందేనని, ప్రజాస్వామ్య దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఇలాగే ఎదుర్కొంటాయని పేర్కొన్నాడు.
ఈ వివరణ ఇచ్చుకున్నప్పటికీ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఆయనను క్యాబినెట్ నుంచి నిరవధికం గా సస్పెండ్ చేశారు.