Asianet News TeluguAsianet News Telugu

తొలిసారి మాస్కు ధరించిన కిమ్ జోంగ్ ఉన్.. వీడియో ఇదే

ప్రపంచ దేశాలన్నీ కరోనాతో తల్లడిల్లుతున్నా ఉత్తర కొరియాకు మాత్రం ఆ వైరస్ వాసన సోకలేదు. కానీ, ఇప్పుడు ఆ దేశంలో తొలి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మాస్క్ ధరించి తొలిసారి కెమెరా ముందు కనిపించాడు.

north korea supreme leader wears first time face mask as covid outbreak in the country
Author
New Delhi, First Published May 13, 2022, 3:55 PM IST

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరల్డ్ ఫేమస్. అమెరికా అధ్యక్షుడికి ఉన్నంత ఫేమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు కిమ్ తరుచూ అంతర్జాతీయ వార్తల్లో మెరుస్తుండేవారు. ఆయన సవాళ్లు, దుస్సహ నిర్ణయాలు, ప్రకటనలు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించేవి. ఆయన తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ చర్చ తీవ్రంగా జరిగేది. కిమ్ జోంగ్ ఉన్ ఆహర్యం భిన్నంగా ఉండటంతో ఆయన అంత సులువుగా విస్మరించేలా ఉండడు. యావత్ ప్రపంచం అంతా కరోనా బీభత్సంతో వణికిపోతుంటే దేశాధినేతలు అందరూ ముఖానికి మాస్కులు పెట్టే కనిపించారు. కానీ, కిమ్ జోంగ ఉన్ మాత్రం ఒక్కసారి కూడా మాస్క్ పెట్టుకోలేదు. కానీ, తాజాగా, ఆయన తొలిసారి మాస్క్ పెట్టుకుని వీడియోలో కనిపించాడు.

ఉత్తర కొరియాలో ఇటీవలే తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్యాంగ్యాంగ్ నగరంలో కొందరు అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్సకు వచ్చారు. అనుమానంతో వారి నుంచి శాంపిళ్లు తీసుకుని కరోనా టెస్టు చేశారు. ఈ కరోనా టెస్టులో వారికి ఒమిక్రాన్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం తమ దేశంలోకి కరోనా వచ్చినట్టు ప్రకటించింది. ఈ తరుణంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి కరోనా వైరస్‌ను కొద్దిమొత్తంలో అడ్డుకునే మాస్క్ ముఖానికి పెట్టుకుని కనిపించాడు.

గురువారం ఉత్తర కొరియా కరోనా వైరస్ తమ దేశంలోకి కూడా ఎంటర్ అయిందని ప్రకటించింది. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైనట్టు గురువారం వెల్లడించింది. ఆ వెంటనే ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

అయితే, ఎన్ని కేసులు నమోదు అయ్యాయనే విషయం తెలియదు. కానీ, ఈ దేశంలో సరైన ఆరోగ్య వ్యవస్థ లేదు. ఆర్థికంగా కూడా అంతంతగానే ఉన్నది. ఇప్పటి వరకు ఈ దేశంలో కరోనా వైరస్‌కు టీకా వేయలేదనే సమాచారం ఉన్నది. ఈ దేశంలో 26 మిలియన్‌ల జనాభా ఉన్నది. చాలా మంది ఇందులో టీకా వేసుకోనివారే. అదీ ఈ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసే నమోదైనట్టు తెలిసింది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ కావడంతో ఉత్తర కొరియాలో పరిస్థితులు రోజుల వ్యవధిలోనే దారుణంగా దిగజారిపోయే  ముప్పు ఉన్నట్టు స్పష్టం అవుతున్నది.

ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కరోనా కేసు నమోదైనట్టు వెల్లడించింది. ప్యాంగ్యాంగ్ నగరంలో కొందరు తీవ్ర జ్వరంతో హాస్పిట్ల‌లో చేరారని, వారి నుంచి కరోనా టెస్టు కోసం శాంపిళ్లు సేకరించినట్టు వివరించింది. శాంపిళ్ల పరీక్షలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన వారు పడ్డట్టు తెలిసిందని పేర్కొంది. అయితే, ఎన్ని శాంపిళ్లు కలెక్ట్ చేశారని, ఎంతమందిలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది.

కాగా, దేశ సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వెంటనే క్రైసిస్ పోలిట్‌బ్యూరోతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిపారు. అత్యంత స్వల్ప సమయంలోనే ఈ మహమ్మారిని వేర్లతోపాటుగా అంతం చేయడమే లక్ష్యం అని ఆయన మీటింగ్‌లో చెప్పినట్టు వివరించారు. దేశ ప్రజల్లో రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్నదని, కాబట్టి, ఈ ఎమర్జెన్సీని కచ్చితంగా గెలుస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ ఎమర్జెన్సీ క్వారంటైన్ ప్రాజెక్ట్‌ను గెలుస్తామని చెప్పినట్టు వివరించారు. అదే విధంగా దేశ సరిహద్దులపై కఠిన నియంత్రణ ఉంచాలని తెలిపారు. అలాగే, ప్రజలకూ ఆయన పలు సూచనలు చేశారు. పని చేసే చోట్ల ఐసొలేట్‌గా ఉండాలని, వైరస్‌ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios