రెండు వారాల క్రితం 'ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రమాదమూ లేద'ని అని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ఉత్తర కొరియా అణు ఆయుధాలతో అమెరికాకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందని, అందుకే ఆ దేశంపై ఇదివరకు విధించిన ఆంక్షలను అలానే కొనసాగిస్తామని ట్రంప్ అన్నారు.

ఇటీవల సింగపూర్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఇరు దేశాల అధ్యక్షులు తమ మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనడంతో పాటు అమెరికా-ఉత్తర కొరియాల మధ్య సంబంధాలను బలోపేతం దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

అయితే, ఇప్పటికే అమెరికా-ఉత్తర కొరియా దేశాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి వైరం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. అంతేకాకుండా, ఇటీవల ఉత్తరకొరియా చేపట్టిన అణ్వస్త్ర ప్రయోగంతో ఈ వైరం మరింత తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, జరిగిన చర్చల తర్వాత ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'ఇక ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అణ్వాయు ముప్పు ఉండద'ని 'ఇక ఈ రోజు రాత్రి అమెరికన్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చ'ని ట్వీట్ చేశారు.

కానీ, ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ మాట మార్చారు. ఉత్తర కొరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ గత 2008 జూన్ 26న అమెరికా 'జాతీయ అత్యవసర పరిస్థితి'ని ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర కొరియాపై పలు రకాల ఆంక్షలు కూడా విధించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షలు కూడా సదరు ఆంక్షలను పునరుద్ధరిస్తూనే వచ్చారు. ఈ విషయంలో తాజాగా ట్రంప్ కూడా అదే చేశారు.

'కొరియా ద్వీపకల్పంలో ప్రమాదకరంగా పొంచిఉన్న విధ్వంసకర ఆయుధాలు, ఉత్తర కొరియా ప్రభుత్వ చర్యలు, విధానాల కారణంగానే జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నామ'ని ట్రంప్ అన్నారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాల వల్ల అమెరికా జాతీయ భద్రతకు, విదేశీ విధానానికి, ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికైనా ప్రమాదమేనని కాంగ్రెస్‌కు పంపిన నోటీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. అణు నిరాయుధీకరణపై ఉత్తర కొరియా స్పష్టమైన నిర్ణయానికి రాకపోవటం వల్లనే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.