పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం నుంచి బయటపడ్డట్టే కనిపిస్తోంది. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి.. అవిశ్వాసంపై ఓటింగ్‌ను తిరస్కరించారు. మరోవైపు ప్రధాని సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు.  

పాకిస్థాన్‌ ప్రధాని (pakistan prime minister) ఇమ్రాన్‌ ఖాన్‌పై (imran khan) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై (No-Trust Motion) ఓటింగ్‌ జరుగుతుందనుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఓటింగ్ జరగకుండా ప్రధాని ఇమ్రాన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే సమయంలో అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకుంటే నేషనల్ అసెంబ్లీని ( national assembly) రద్దు చేస్తానని కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్నారు నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సూరీ (qasim suri) . ఈ మేరకు ఆయన ఓటింగ్‌ను తిరస్కరించారు.

ఆ వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇమ్రాన్‌ ఖాన్‌. అలాగే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ (arif alvi) ప్రకటించారు. జాతీయ అసెంబ్లీ రద్దు అయినప్పటికీ పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ కొనసాగనున్నారు. అయితే, తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించాయి.

అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ సభకు హాజరుకాలేదు. తనకు ‘ప్లాన్‌-బీ’ వుందన్న ఆయన అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీతో భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యక్షుడికి వివరించిన ఇమ్రాన్‌, జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరినట్లు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్‌ వెల్లడించారు. అందుకు అనుగుణంగానే జాతీయ అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 90 రోజుల్లోనే పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

మరోవైపు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు (pakistan supreme court) .. విచారణ నిమిత్తం బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికార పక్షం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిందంటూ కోర్టులో అప్పీల్ చేసిన ప్రతిపక్ష సభ్యులు.. పార్లమెంట్‌లో బైఠాయించారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని... అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించలేదని ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan People's Party) నేత బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) ట్వీట్ చేశారు. 

అంతకుముందు రాజీనామా చేయడానికి చివరికి వరకు ససేమిరా అన్న ఇమ్రాన్ ఖాన్.. చివరి బంతి వరకు ఆడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ద్రోహులను కంటికి రెప్పలా చూసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇమ్రాన్ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో నెలకొన్న సమస్యలపై తాను అమెరికా (america), యూరప్ దేశాలవైపు నిలబడనందుకు ప్రతిపక్షాలు తనను తొలగించడానికి వాషింగ్టన్‌తో కలిసి కుట్ర పన్నుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. 

ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ( Pakistan Tehreek-e-Insaf) గత వారం 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు. అంతేకాదు మరో 12 మందికి సభ్యులు కూడా విపక్షానికి అనుకూలంగా మారిపోయారు. అటు ప్రతిపక్షానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ (పీఎమ్ఎల్ ఎన్) (pakistan muslim league n) , పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకత్వం వహిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పాక్ రాజకీయాలను శాసించిన కుటుంబాలకు చెందినవి.