చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృతులకు సంబంధించి చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ కీలక వివరాలు వెల్లడించింది.
చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణ గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో 132 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. మొత్తం 132 మందిలో 123 మంది ప్రయాణికులు.. 9 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతులకు సంబంధించి చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ కీలక వివరాలు వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని వెల్లడించింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత 18 గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
‘విమానం శిథిలాలు సంఘటనా స్థలంలో కనుగొనబడ్డాయి. కానీ ఇప్పటి వరకు విమానంలో ప్రయాణిస్తూ సంబంధాలు కోల్పోయిన వారిలో ఎవరూ కనుగొనబడలేదు’ అని మంగళవారం ఉదయం CCTV తెలిపింది. ఇప్పటికీ విమాన ప్రమాదం జరిగిన స్థలంలో రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మొత్తం 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. తాము రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి విమాన ప్రమాదాలు చోటుచేసుకోకుండా.. విమానం క్రాష్ ల్యాండింగ్ గల కారణాల్ని వీలైనంత త్వరగా కనుగొంటామని తెలిపారు.
ఇక, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ప్లేన్ 132 మందితో బయల్దేరిందని, అది వుజో దగ్గర టెంగ్ కౌంటీలో క్రాష్ అయిందని అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. క్రాష్ అయిన కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని వివరించింది. ఫ్లైట్ ఎంయూ5735 షెడ్యూల్ టైమ్ కల్ల గువాంగ్జికి చేరలేదని, కున్మింగ్ నుంచి ఇది మధ్యాహ్నం 1.11 గంటలకు (0511 జీఎంటీ) బయల్దేరిందని విమానాశ్రయ సిబ్బంది వ్యాఖ్యలను స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అది 3.05 గంటలకు (0705జీఎంటీ) కి ల్యాండ్ కావాల్సిందని తెలిపింది. కానీ, ఆ ఫ్లైట్ 2.22 గంటలకు (0622 జీఎంటీ) ట్రాకింగ్‌లో లేకుండా పోయింది. ఫ్లైట్ మిస్ అయినప్పుడు 3225 ఎత్తులో 376 నాట్‌ల వేగంతో ఉన్నట్టు తెలిసింది.
