Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ సంచలన ప్రకటన: కేసుల్లేవ్.. కోర్టుల్లేవ్.. తరిమేయడమే..!

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిపట్టి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది.

No Judges, No Courts, Stright Deportation: Trump

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండిపట్టి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, దేశంలోకి అక్రమంగా వచ్చే వారిని అక్కడిక్కడే పట్టుకొని సరిహద్దు జైళ్లలో నిర్బందిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. కాగా.. ఇలా బందీలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటం, వారి పూర్వపరాలు తెలుసుకోవటంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించారని తెలిస్తే, వారి విషయంలో కోర్టులు, కేసులు లేకుండా ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికే పంపేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంది.  తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు వుండవని, వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కి పంపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 

'మన దేశంలోకి ఈ ఆక్రమణదారులను మేం అనుమతించలేము. ఎవరైనా అక్రమంగా వస్తే జడ్డీలు, కోర్టులు, కేసులు ఏమీ లేకుండా తక్షణమే వారిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయాలి. మన వ్యవస్థ మంచి ఇమ్మిగ్రేషన్‌ పాలసీని, శాంతిభద్రతలను అపహాస్యం చేస్తోంద'ని ట్రంప్ ట్వీట్ చేశారు.

కాగా.. మరో ట్వీట్‌లో 'చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా వస్తున్నారు. విచారణకు ఏళ్ల సమయం పడుతోంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే వలసలు ఉండాలి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చే ప్రజలు కావాలి' అంటూ ట్వీట్ చేశారు.

బందీల్లో 100 మంది భారతీయులు!

తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ సుమారు 100 మంది భారతీయులను కూడా అమెరికా నిర్భందంలో ఉంచింది. ఇందులో 40-45 మందిని ఫెడరల్ డిటెన్షన్ కేంద్రాలైన న్యూమెక్సికోలో నిర్భందించగా, మరో 52 మందిని ఓరేగాన్ డిటెన్షన్ కేంద్రంలో నిర్బంధించారు.  వీరిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios