బ్రిటన్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోన్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు మరో ఆందోళకరమైన విషయాన్ని గుర్తించారు.

పిల్లలకు ఈ స్ట్రెయిన్ చాలా త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ బ్రిటన్‌లో ఈ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చిందని, శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఎక్కువగా పెద్దలపైనే ప్రభావం చూపిందని, అయితే ఈ కొత్త వైరస్ మార్పు చెందే అవకాశం ఉందని, దీంతో చిన్నారులకు మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్ట్రెయిన్ మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించగానే వైరస్‌కు సంబంధించిన మార్పులు మొదలవుతాయని, దీని వల్ల చిన్నారులతో పాటు పెద్దల్లోనూ రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. 

కొత్త స్ట్రెయిన్ చిన్నారుల శరీర కణాలలోకి ప్రవేశించిన తర్వాత చాలా వేగంగా మార్పు చెందుతుందని అన్నారు. దీనిపై తాము మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. 

కొత్తరకం కరోనా స్ట్రైయిన్ ప్రాణాంతకమైందని చెప్పడానికి ఎటువంటి ఆధారాల్లేవని, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

కాగా, యూకేలో స్ట్రెయిన్ వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో పలు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్ కూడా యూకే నుంచి వచ్చే విమానాలపై మంగళవారం నుంచి నిషేధం విధించింది.