బ్రిటన్ నుంచి ప్రపంచదేశాలకు వేగంగా పాకుతున్న స్ట్రెయిన్ ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ఎలాంటి ప్రయాణ హిస్టరీ లేని 20యేళ్ల వ్యక్తిలో కొత్తరకం కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అగ్రరాజ్యం ఆందోళనలో పడింది.

అమెరికా, కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ జేర్డ్‌ పొలిస్‌ తెలిపారు.  ఈ కొత్త వైరస్‌ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కల్గిస్తుంది. 

ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్‌ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీని మూలాలు తెలుసుకునేందుకు బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 

ఇక బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి అమెరికా ఆ దేశం నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్టు చూపించాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్‌ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్‌ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. 

ఇక మనదేశంలోను కొత్త కరోనా కేసులు 20కి చేరుకున్నాయి. నిన్న ఆరు కేసులు వెలుగు చూడగా.. తాజాగా నేడు 14 కేసులు నమోదయ్యాయి.