Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్‌ లో పెరిగిపోతున్న టైర్‌–4 ప్రాంతాలు.. మొదటికంటే 11శాతం ఎక్కువ మరణాలు..!

బ్రిటన్ ను కరోనా స్ట్రెయిన్ వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త సంవత్సరం వేళ యూకేలో కరోనా వైరస్‌ విజృంభణ మరింత కొనసాగుతోంది. 

New coronavirus strain tension in britain - bsb
Author
Hyderabad, First Published Jan 1, 2021, 9:56 AM IST

బ్రిటన్ ను కరోనా స్ట్రెయిన్ వణికిస్తోంది. రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త సంవత్సరం వేళ యూకేలో కరోనా వైరస్‌ విజృంభణ మరింత కొనసాగుతోంది. 

గత నెలరోజుల్లోనే రికార్డు స్థాయిలో నమోదైన కేసులు, మరణాలతో బ్రిటన్‌ ప్రజలు ఆంక్షల చట్రం మధ్య బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా వైరస్‌ ఉధృతరూపం దాలుస్తోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనల్ని పాటించాలని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించారు. 

అంతేకాదు దేశాన్ని కేసుల తీవ్రత ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించి వివిధ రకాలుగా ఆంక్షల్ని ప్రవేశపెట్టారు. కేసులు ఓ మాదిరిగా ఉంటే టైర్‌–1 అని, ఎక్కువ ఉంటే టైర్‌–2, అత్యధికంగా ఉంటే టైర్‌–3 అని పిలుస్తారు. ఇక టైర్‌–4లో ఉన్న ప్రాంతాల్లోని వారు అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రాకూడదు. నిత్యావసరాలు మినహా మిగతా మార్కెట్‌ అంతా మూసేశారు.

ఈమధ్య కాలంలో టైర్‌–4 ప్రాంతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి మార్కెట్లన్నీ మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. టైర్‌–4లో ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు ఏప్రిల్‌ వరకు కొనసాగుతాయి. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే దేశమంతటా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయి. 

యూకే వ్యాప్తంగా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే 11శాతం ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో బుధవారం 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా,  గురువారం  మరిన్ని పెరిగి కొత్తగా 55,892 కేసులు వచ్చాయి. బుధ, గురువారాల్లో దాదాపు 2వేల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది.

మొత్తం కేసులు 24,88,780కు, మొత్తం మరణాలు 73,512కు చేరుకున్నాయి. వేల్స్‌లో కేసులు శరవేగంగా పెరుగు తున్నాయి. ప్రతీ 60 మందిలో ఒకరికి వైరస్‌ సో కింది. వేల్స్‌ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.  

ఇంగ్లండ్‌లో 2 కోట్ల మంది వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సెకండరీ స్కూల్స్‌కి క్రిస్మస్‌ సెలవుల్ని మరో 15 రోజులు పొడిగించారు. ఉత్తర ఐర్లాండ్‌లో 6 వారాల లాక్‌డౌన్‌. స్కాట్‌లాండ్‌లో టైర్‌–4లో ఉండడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. స్కాట్‌ల్యాండ్‌ నుంచి యూకేలో ఇతర ప్రాంతాలైన ఇంగ్లండ్, వేల్స్,ఐర్లాండ్‌లకు రాకపోకలపై నిషేధం విధించారు. కొత్త రకం వైరస్‌ భయతో యూకే నుంచి విమాన రాకపోకలపై 40 దేశాలు నిషేధం విధించాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios