ఒమిక్రాన్ (Omicron) వేరియంట్‌ తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినప్పటికీ.. ఐరాపా దేశాలపై (Europe Nations) తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌ తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినప్పటికీ.. ఐరాపా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో ఒమిక్రాన్ భయాందోళన (Omicron Scare) నెలకొంది. బ్రిటన్‌లో 25వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకల తర్వాత బ్రిటన్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో ఐరోపా దేశం నెదర్లాండ్స్‌ మాత్రం క్రిస్మస్ లాక్‌డౌన్‌ను (Netherlands Christmas lockdown) ప్రకటించింది. యూరప్‌లో విపరీతంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో లాక్‌డౌన్‌ విధించాలనే నిర్ణయం తీసుకుంది. ఆదివారం (డిసెంబర్ 19) నుంచే ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. 

ఇందుకు సంబంధించిన వివరాలును శనివారం నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె (Mark Rutte) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అన్ని నాన్ ఎసెన్షియల్ షాపులను, కల్చరల్, ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలను మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. జనవరి 14 వరకు వీటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. స్కూల్స్ కనీసం జనవరి 9వ తేదీ వరకు మూసివేయబడతాయని తెలిపారు. మరోవైపు నెదర్లాండ్‌లో ప్రజలు ఇళ్లలో వేడుకలకు అతిథుల పరిమితి విషయంలో కఠిన నిబంధనలు ఎదుర్కొంటున్నారు. అయితే క్రిస్మస్ వేడుకలకు మాత్రం అధికారులు మినహాయింపు ఇచ్చారు. క్రిస్మస్, న్యూ ఈయర్ వేడుకలకు మాత్రం నలుగురు అతిథులకు అనుమతి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

గత నెల చివరిలో రాత్రిపూట లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత నెదర్లాండ్స్‌లో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇటీవలి వారాల్లో రికార్డు స్థాయి నుంచి తగ్గింది. ఇప్పటికే నెదర్లాండ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నందున్న.. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్ ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే.. తర్వాత ఆస్పత్రులలో పరిస్థితులు దారుణంగా ఉంటయాని.. వాటిని నిర్వహించుకునే స్థితి కూడా ఉండదని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె అన్నారు. 

Also read: Covid Third wave: జనవరిలో కరోనా థర్డ్ వేవ్.. కొత్తగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం !

మరోవైపు ఐరాపా‌లోని చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింతగా వేగంగా కొనసాగించేందుకు పలుదేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రయాణ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. 

లండన్‌లో అత్యవసర పరిస్థితి లాంటిది నెలకొందని మేయర్ సాధిక్ ఖాన్ అన్నారు. కేసుల పెరుగుదల భారీగా ఉందని పేర్కొన్నారు. లండన్‌లో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఫ్రాన్స్, డెన్మార్క్‌లలో కేసులు పెరుగుతున్న కారణంగా జర్మనీ ఆ రెండు దేశాలను హై రిస్క్ జోన్‌లు పేర్కొంది. టీకాలు వేయించుకుని ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచనున్నట్టుగా తెలిపింది. 

ఐర్లాండ్ ప్రభుత్వం.. బార్‌లు, రెస్టారెంట్‌లను రాత్రి 8.00 గంటలకు మూసివేయమని ఆదేశిస్తోంది. ఫ్రాన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలపై ముఖ్యమైన పరిమితులను విధించాలని నిపుణుల ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది. ఛాంప్స్ ఎలీసీస్‌లో అన్ని ఈవెంట్‌లను రద్దు చేస్తున్నట్లు‌గా ప్యారిస్ ప్రకటించింది. డెన్మార్క్ సినిమా హాళ్లు, ఇతర వేదికలను మూసివేస్తోంది.