మహిళలకు పీరియడ్స్.. ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు.. పీరియడ్స్ వచ్చిన మహిళలను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోనివ్వకుండా దూరంగా ఉండచేవారు.  మన దగ్గర ఈ ఆచారాన్ని అందరూ పక్కన పెట్టేశారు. కానీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ రకం ఆచారాలను, మూఢనమ్మకాలను ఫాలోఅవుతూనే ఉన్నారు. కాగా.. ఇలాంటి ఆచారం కారణంగానే.. ఒక తల్లి.. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన నేపాల్ లో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  నెపాల్ లోని బజరా జిల్లాకు  చెందిన మహిళ బొహరా(35)కి పీరియడ్స్ వచ్చాయి. దీంతో.. అక్కడి వారి ఆచారం ప్రకారం నెలసరి వచ్చినప్పుడు మహిళలు..  ఇంట్లో కాకుండా.. పక్కనే కట్టిన గుడిసెలాంటి దాంట్లో ఉండాలి. దానికి కిటికీలు కూడా ఉండవు. ఉన్న ఒక్క తలుపుని కూడా.. మహిళ లోపలికి వెళ్లగానే మూసేస్తారు. 

ఈనెల 9వ తేదీన సదరు మహిళ.. తన ఇద్దరు చిన్నారులతో సహా.. ఆ గుడిసెలాంటి ఇంట్లోనే ఉంది. రాత్రి సమయంలో కుమారులతో సహా అక్కడే నిద్రించింది. చలి కాలం కావడంతో.. చలిని తట్టుకునేందుకు,.. ఆ గుడిసెలో ఓ  మూలన చలిమంట వేసుకొని పడుకున్నారు.  అయితే.. ఆ పొగ.. బయటకు పోకపోవడంతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. ఈ ఘటనపై స్థానిక పలు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా ఇలాంటి ఆచారాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.