Asianet News TeluguAsianet News Telugu

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం: చైనా సహాయంతో నిర్మాణం, రెండు వారాల క్రితమే పోఖారా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం..

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 72 మందితో ప్రయాణిస్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం ఆదివారం పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొన్ని సెకన్ల ముందు కుప్పకూలింది.

Nepal Pokhara airport was inaugurated two weeks ago and built with Chinese assistance
Author
First Published Jan 15, 2023, 5:08 PM IST

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 72 మందితో ప్రయాణిస్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం ఆదివారం పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొన్ని సెకన్ల ముందు కుప్పకూలింది. అయితే పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు వారాల క్రితమే ప్రారంభమైంది. చైనా సాయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్శించారు. సహజమైన అన్నపూర్ణ పర్వత శ్రేణి నేపథ్యంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయాన్ని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ 2023 జనవరి 1న అధికారికంగా ప్రారంభించారు.

అయితే ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారంలో భాగంగా నిర్మితమైంది. ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక ప్రకారం.. ఈ టూరిస్ట్ హబ్‌లో విమానాశ్రయం నిర్మాణం కోసం నేపాల్ ప్రభుత్వం 2016లో మార్చి చైనాతో 215.96 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందంపై సంతకం చేసింది. గత ఏడాది చైనా మాజీ విదేశాంగ మంత్రి వాంగ్ యి.. బలువతార్‌లో జరిగిన మర్యాదపూర్వక భేటీలో అప్పటి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు పోఖారా ప్రాంతీయ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పగించారు.

విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రచండ మాట్లాడుతూ.. నేపాల్ వంటి భూపరివేష్టిత దేశానికి ఏరియల్ కనెక్టివిటీ అత్యంత ప్రభావవంతమైన కనెక్టివిటీ అని అన్నారు. ఇక, ఈ విమానాశ్రయం ప్రారంభంతో అంతర్జాతీయ ప్రాంతంతో పొఖరాకు సంబంధాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే.. ఖాట్మండు నుంచి పోఖారాకు బయలుదేరిన ఏటీఆర్ 72 విమానం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా..  పాత విమానాశ్రయం, కొత్త విమానాశ్రయం మధ్య ఉన్న సేతీ నది ఒడ్డున కూలిపోయింది. ఇందులో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్(సీఏఏఎన్) ప్రకారం విమానం ల్యాండ్ చేయడానికి అనుమతి పొందింది మై రిపబ్లికా వార్తాపత్రిక నివేదించింది. ‘‘వాతావరణం సమస్య కాదు. సాంకేతిక కారణాల వల్ల విమానం కూలిపోయిందని ప్రాథమిక సమాచారం అందింది. గాలిలో ఉండగానే విమానంలో మంటలు కనిపించాయని సమాచారం అందింది. ’’ అని సీఏఏఎన్ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపినట్టుగా పేర్కొంది.

ఇక, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 68కి పెరిగినట్టుగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ తెలిపింది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఆదివారం ఐదుగురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios