Coronavirus: ముంచుకొస్తున్న ముప్పు.. చైనాలో లాక్‌డౌన్.. ఆంక్షల్లో 30 మిలియన్ల మంది !
Coronavirus: ప్రపంచం మరోముప్పును త్వరలోనే ఎదుర్కొనబోతున్నదా? అంటే చైనాలోని పరిస్థితులు అవునే సమాధానమిచ్చేలా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌తో పాటు కరోనా కొత్త వేరియంట్లు చైనాలో పంజా విసురుతున్నాయి. రోజురోజుకూ రెట్టింపు కంటే అధికంగా కరోనా కేసులు నమోదవుతూ.. ఆందోళనను పెంచుతున్నాయి.
Coronavirus: చైనాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ తో పాటు కొత్త వేరియంట్ల విజృంభణతో అక్కడ కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో చైనా మళ్లీ లాక్‌డౌన్ లోకి జారుకుంటోంది. ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు విధించారు అధికారులు. మంగళవారం చైనా అంతటా దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇదివరకు చూడని విధంగా ప్రస్తుతం అక్కడ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య అధికారులు నగర వీధుల్లోకి వచ్చి సామూహిక పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
చైనా మంగళవారం 5,280 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. జీరో కోవిడ్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తున్న చైనాలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడటం అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేస్తున్నాయి. కరోనా స్టెల్త్ వేరియంట్ లతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. కరోనా కేసులు గణనీయంగా రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలోప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పలు కీలకమైన పలు నగరాల్లో లాక్ డౌన్ విధించింది. మంగళవారం నాటికి లాక్‌డౌన్ లోకి వెళ్లిన నగరాల సంఖ్య 13కు పెరిగింది. దేశంలో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతున్న నగరాలు చాలానే ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం.. జిలిన్ ఈశాన్య ప్రావిన్స్‌లో మంగళవారం 3,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రావిన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చాంగ్‌చున్‌తో సహా అక్కడి అనేక నగరాల నివాసితులు లాక్‌డౌన్ లో ఉన్నారు. 17.5 మిలియన్ల జనాభా ఉన్న దక్షిణాది టెక్ హబ్ షెన్‌జెన్ లో అనేక కర్మాగారాలు మూసివేయబడ్డాయి. ఇప్పటికే మూడు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంది. చైనా లోని అతిపెద్ద నగరం షాంఘై నగరవ్యాప్త షట్‌డౌన్‌కు తక్కువ పరిమితుల విధించింది.
రాజధానికి దగ్గరగా..
ఇక చైనాలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్ వెలుగుచూసిన 2019 ప్రారంభ రోజులను గుర్తు చేస్తున్నాయి. వూహాన్ నగరంలో వ్యాప్తి ప్రారంభమైన అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది కోవిడ్ మహమ్మారి. లక్షలాది మందిని బలి తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న ప్రాంతాలు చైనా రాజధాని బీజింగ్‌కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. కరోనా బారినపడ్డ వారిని ఒంటరిగానే క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాలో 1,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవడం మంగళవారం నాటికి వరుసగా ఆరో రోజు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ చర్యలు ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.