అంతరిక్షం ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే.. ఇక అక్కడినుంచి భూమిని చూడడం అంటే అది అద్భుతమే. అలాంటి  ఓ అద్భుతాన్ని నాసా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతశ్రేణులైన హిమాలయాలను అంతరిక్షంనుంచి ఫొటో తీసి తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఎప్పడూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయలు ఈ చలికాలంలో మరింత దట్టమైన మంచుతో ముడుచుకుపోతాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ అరుదైన చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌​ చేసింది. ‘అంతరిక్షం నుంచి చూస్తే.. దట్టమైన తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతశ్రేణులు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది తీసింది’ అని కాప్షన్‌ జతచేసింది. 

 ఈ చిత్రంలో హిమాలయాలతో పాటు ప్రకాశవంతమైన కాంతులతో ​మెరిసిపోతున్న న్యూఢిల్లీ, లాహోర్‌, పాకిస్తాన్‌ నగరాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఫొటోలోని కుడివైపు అంటే హిమాలయాలకు దక్షిణ భాగంలో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని సారవంతమైన వ్యవసాయ భూమి కనిపిస్తోందని పేర్కొంది. 

నాసా  విడుదల చేసిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. లక్షల మంది ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో వీక్షించగా వేలాది మంది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్‌.. ఇది చాలా అందమైన ఫొటో’, కచ్చితంగా ఆశ్చర్యపరిచే అద్భుతమైన చిత్రం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి చిత్రాలను నాసా గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.