Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్: 26/11 దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు జైలు శిక్ష

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

mumbai attacks Mastermind Hafiz Saeed Gets 10-Year Jail Term In 2 Terror Cases ksp
Author
Islamabad, First Published Nov 19, 2020, 4:17 PM IST

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. హఫీజ్‌తో పాటు మరో ముగ్గురికి సైతం జైలు శిక్ష విధిస్తూ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడికి హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. 

2020లో సయీద్‌కు ఇది నాల్గవ శిక్ష. హఫీజ్ ప్రస్తుతం టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో లాహోర్‌ జైలులో ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు.  కాగా హఫీజ్‌తో పాటు న్యాయస్థానం అతని అనుచరులు జాఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్‌ల‌కు సైతం పదిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

మరో ఉగ్రవాది అబ్ధుల్ రెహమన్ మక్కికి ఆరు నెలల శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే హఫీజ్ ఆస్తులను జప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. 

టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో జూలై 17, 2019న హఫీజ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇక అతని ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్ ఉద్ దావా నాయకులపై మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. వీటిలో 24 కేసుల్లో విచారణ పూర్తవ్వగా, మిగిలినవి ఏటీసీ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి.

సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ 2008లో ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు సహా 166 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ.. హఫీజ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.

అలాగే 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన 1267 తీర్మానం సైతం హఫీజ్ సయిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.

రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులలో 2020 ఫిబ్రవరిలో ఉగ్రవాద నిరోధక కోర్టు అతనికి 11 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో అతనిని లాహోర్‌లోని లఖ్‌పత్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు.  

కాగా కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్‌ ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.

ముంబైకి ప్రయాణించడానికి ఉగ్రవాదులు ఉపయోగించే రెండు పడవల్లోని సిబ్బంది, డబ్బు బదిలీల ద్వారా దాడులకు ఆర్థిక సహాయం చేసిన వారి పేర్లు ఎక్కువగా ఈ జాబితాలో ఉన్నాయి.

19 మంది పురుషులలో ఎక్కువ మంది లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యులే ఉండటం విశేషం. ఈ జాబితా పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని, ముంబై మారణహోమం సృష్టించేందుకు సూత్రధారి, కుట్రదారులను జాబితాలో పొందుపరచకపోవడం అవివేకం అని భారత్‌ విమర్శించింది.

టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో దోషిగా తేలి ప్రస్తుతం లాహోర్ జైలులో ఉన్న హఫీజ్ సయీద్ ముంబై దాడులకు సూత్రధారి అని భారత్ ఆరోపించింది. 2008 నవంబర్ దాడులతో హఫీజ్‌ సయీద్‌ను నేరస్థుడని తెలిపే ఆధారాలు ఏవీ లేవని పాకిస్తాన్ పదేపదే వాదించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios