mount merapi eruption : మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 23 మంది పర్వతారోహకులు మృతి..
Indonesia mount merapi eruption : ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఒక్క సారిగా విస్పోటనం చెందింది. ఈ ఘటనలో 23 మంది పర్వతారోహకులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు.
mount merapi eruption : ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విస్పోటనం చెందిన ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. నిన్నటి వరకు ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 11 అని అధికారులు చెప్పారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ప్రమాదకర వాలులో చిక్కుకున్న మరిన్ని మృతదేహాలను కనుగొన్నారు.
‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. ఆదివారం సంభవించిన పేలుడులో 50 మందికి పైగా పర్వతారోహకులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. అయితే అదే సమయంలో 11 మంది మరణించినట్టు ప్రాథమికంగా అక్కడి అధికారులు నిర్ధారించారు. సోమవారం మరో విస్ఫోటనం జరగడంతో 800 మీటర్ల (2,620 అడుగులు) ఎత్తులో కొత్త వేడి బూడిదను గాల్లోకి లేచింది. దీని వల్ల గాలింపు చర్యలకు ఆటకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాగా.. తాజా మృతదేహాలు విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లభ్యమయ్యాయని, కేవలం కొన్ని మీటర్ల (గజాలు) దూరంలో ఉన్నాయని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ ఎడి మార్డియాంటో తెలిపారు. ఇప్పుడు ఐదుగురు పర్వతారోహకుల మృతదేహాలు లభించాయని, అయితే ఈ విస్ఫోటనానికి దగ్గరగా ఉండటంతో 18 మంది మరణించినట్లు భావిస్తున్నారు
ఇండోనేషియాకు చెందిన సెంటర్ ఫర్ వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ డిజాస్టర్ మిటిగేషన్ ప్రకారం.. 2011 నుండి మరాపి మూడో హెచ్చరిక స్థాయిలో ఉంది. దీని వల్ల ఇది సాధారణం కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో శిఖరానికి 3 కిలోమీటర్ల వరకు పర్వతారోహకులు, గ్రామస్థులు రాకుండా అధికారులు నిషేదించారు.
పర్వతారోహకులను కేవలం డేంజర్ జోన్ కింద మాత్రమే అనుమతించారు.అయితే చాలా మంది అనుమతించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కి ఉంటారని, నివాసితులు కూడా ఈ ప్రాంతంలో ఉండి ఉంటారని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీని వల్ల విస్ఫోటనం వల్ల చిక్కుకున్న వారి సంఖ్యను కనుక్కోవడం అసాధ్యంగా మారింది. కాగా.. ఈ మరాపి అగ్నిపర్వతం ఆకస్మికంగా విస్ఫోటనం అవుతూ ఉంటుంది. అందువల్ల అది ఎప్పుడు పేలుతుందో గుర్తించడం కష్టం. అయితే ఈ మరాపి జనవరి విస్ఫోటనం నుండి యాక్టివ్ గా ఉంది. కానీ ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.