Asianet News TeluguAsianet News Telugu

త‌గ్గ‌ని మంకీపాక్స్ క‌ల‌వ‌రం.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న ప‌లు దేశాలు

monkeypox cases: అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తాజా సమాచారం ప్రకారం సోమవారం నాటికి యూఎస్ లో 27,000 మంకీపాక్స్ కేసులు నిర్ధారించబడ్డాయి. ఇప్ప‌టికీ కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 
 

Monkeypox : Many countries are taking strict measures
Author
First Published Oct 19, 2022, 10:19 AM IST

monkeypox cases in US: ఆఫ్రికాలోని కొన్ని దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితమైన ఉన్న మంకీపాక్స్  కేసులు ప్ర‌స్తుతం చాలా దేశాల్లో న‌మోద‌వుతున్నాయి. ప‌లు దేశాల్లో కొత్త కేసులు నమోదు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా, మ‌రొకొన్ని దేశాల్లో అధికంగా కేసులు న‌మోదుకావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అగ్ర‌రాజ్యం అమెరికాలో మంకీపాక్స్ క‌ల‌వ‌రం మ‌ళ్లీ మొద‌లైంది. గ‌త కొంత కాలంగా త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తాజా సమాచారం ప్రకారం సోమవారం నాటికి అమెరికాలో 27,000 మంకీపాక్స్ కేసులు నిర్ధారించబడ్డాయి. యూనైటెడ్ స్టేట్స్ లోని  కాలిఫోర్నియాలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు 5,278 మంకీపాక్స్ కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాతి స్థానంలో న్యూయార్క్‌లో 4,039, ఫ్లోరిడాలో 2,648 కేసులు నమోదయ్యాయి అని Xinhua వార్తా సంస్థ సీడీసీ డేటాను ఉటంకిస్తూ నివేదించింది. అయితే, అక్క‌డి అధికారులు గ‌తంతో పోలిస్తే మంకీపాక్స్ కేసులు వ్యాప్తి త‌క్కువ‌గానే ఉంద‌నీ, కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. 

యూఎస్‌లో మంకీపాక్స్ కేసులు ప్రారంభంలోకంటే ప్ర‌స్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ 12 నాటికి, దేశంలో ఏడు రోజుల సగటు 63 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 1 న నమోదైన 583 రోజువారీ కేసుల రికార్డు నుండి తగ్గింది. మంకీపాక్స్ అంటువ్యాధులు చాలా అరుదుగా ప్రాణాంతకంగా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాలలో రెండు నుండి నాలుగు వారాల్లో ఈ వ్యాధి బారిన‌ప‌డ్డ‌వారు కోలుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మంకీపాక్స్ వ్యాధి మరణాల రేటు 3 నుండి 6 శాతం వరకు ఉంటుంది.

అయినప్పటికీ, సీడీసీ ప్రకారం, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు సోకినప్పుడు తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవించే అవకాశం ఉంది. దీంతో ప్రాణ‌ముప్పును ఎదుర్కొవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని పేర్కొంటోంది. అందుకే అక్క‌డి పౌరుల‌కు ముందుగానే వ్యాక్సిన్, మెరుగైన చికిత్స అందించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు అక్క‌డి అధికారులు పేర్కొంటున్నారు. చాలా దేశాల్లో మంకీపాక్స్ ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని అంత‌ర్జాతీయ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 కేసులు మొద‌టగా వెలుగు చూసిన చైనాలో ఇప్ప‌టికీ దాని ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. జీరో కోవిడ్-19 నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న ఆ దేశం.. మంకీపాక్స్ వ్యాప్తి నిరోధించ‌డానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

మెక్సికోలో అయితే, అక్క‌డి ప్ర‌జ‌లు మంకీపాక్స్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం టీకాలు ఇవ్వ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు అధికంగా న‌మోదైన దేశాల్లో మెక్సికో 9వ స్థానంలో ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డేటా పేర్కొంటోంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి పౌరులు మంకీపాక్స్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే టీకాలు పొంద‌డానికి విదేశాల‌కు వెళ్తున్నట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios