సారాంశం

వారం రోజులకు కనిపించకుండా పోయిన అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్ ఫ్లుయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా బుధవారం శవమై కనిపించాడు.

అర్జెంటీనా : స్పెయిన్ కి చెందిన ఓ క్రిప్టో ఇన్ ఫ్లుయెన్సర్ అర్జెంటీనాలో ఇటీవల ఆచూకీ లేకుండా పోయాడు. అతని గురించి చేపట్టిన గాలింపు విషాదాంతమయ్యింది. పోలీసులు ఆ క్రిప్టో ఇన్ ఫ్లుయెన్సర్ చనిపోయినట్లుగా  గుర్తించారు. ఓ సూట్ కేసులో అతడి మృతదేహం ముక్కలు ముక్కలుగా లభించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇది ప్రొఫెషనల్ కిల్లర్ పని అని అనుమానిస్తున్నారు.

 దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఫెర్నాండో పెరెజ్ అల్గాబా అనే స్పెయిన్ కు చెందిన వ్యక్తి  ఇటీవల కొంత కాలం క్రితం అర్జెంటీనాకు వచ్చాడు. అతను లగ్జరీ కార్లను అద్దెకిస్తుంటాడు. దీంతోపాటు క్రిప్టో కరెన్సీ విక్రేతగా ఫెర్నాండో  పెరెజ్ అల్గాబాకు పేరుంది. అతనిది లగ్జరీ జీవితం. ఫెర్నాండో  పెరెజ్ అల్గాబా క్రిప్టో ఇన్ ఫ్లుయెన్సర్ కూడా.  

అమెరికాలో కోలుకుంటున్న భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య.. ఇంతకీ ఆమెకు ఏమైందంటే ?
ఇంస్టాగ్రామ్ లో అతనికి 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జులై రెండో వారంలో అర్జెంటీనాకు వచ్చిన తర్వాత జూలై 19 నుంచి ఫెర్నాండో  పెరెజ్ అల్గాబా కనిపించకుండా పోయాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అప్పటినుంచి అతని గురించి గాలింపు చేపట్టారు.  కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అతని మృతదేహం లభించింది.  కొంతమంది పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఓ సూట్ కేసు అక్కడ ఉండడాన్ని గుర్తించారు. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా అందులో.. మనిషి శరీర భాగాల్లా అనిపించాయి. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సూట్కేసును స్వాధీనం చేసుకుని.. తెరిచి చూడగా అందులో మనిషికి చెందిన కాళ్లు చేతులు ఉండడం గమనించారు. దీని మీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మూడురోజుల తర్వాత తల, ఇతర శరీర భాగాలు దొరికాయి. వాటన్నింటినీ ఫోరెన్సిక్ టెస్టుల కోసం పంపించారు. 

మృతదేహపు శరీర భాగాలపై ఉన్న టాటూలు, ఫింగర్ప్రింట్ల ఆధారంగా.. చనిపోయిన వ్యక్తి ఫెర్నాండో పెరెజ్ అల్గాబాగా గుర్తించారు పోలీసులు. అతన్ని చంపడానికి ముందు మూడు రౌండ్ల బుల్లెట్లు శరీరంలోకి దింపినట్లుగా కనుగొన్నారు. ఇది ప్రొఫెషనల్ కిల్లర్ పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.