బాప్టిజం కార్యక్రమం వేళ కూలిన చర్చి పైకప్పు.. 11 మంది మృతి, 60 మందికి గాయాలు..
ఉత్తర మెక్సికోలోని ఒక చర్చి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు.
ఉత్తర మెక్సికోలోని ఒక చర్చి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వివరాలు.. తమౌలిపాస్ రాష్ట్రంలోని ఈశాన్య తీర పట్టణమైన సియుడాడ్ మాడెరోలోని చర్చి లోపల ఆదివారం బాప్టిజంకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో చర్చిలో సుమారు 100 మంది ఉన్నారని అంచనా. అయితే చర్చి పైకప్పు కూలిన ఘటనలో కనీసం 60 మంది గాయపడ్డారని.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తమౌలిపాస్ భద్రతా ప్రతినిధి తెలిపారు.
ఘటన స్థలంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో నేషనల్ గార్డ్, స్టేట్ గార్డ్, సివిల్ ప్రొటెక్షన్, రెడ్‌క్రాస్ యూనిట్లు సహాయం చేస్తున్నాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో చర్చి లోపల 70 మంది మాత్రమే ఉన్నారని తమౌలిపాస్ రాష్ట్ర గవర్నర్ అమెరికో విల్లారియల్ చెప్పారు. కుప్పకూలిన కాంక్రీట్ స్లాబ్ కిందకు సెర్చ్ డాగ్‌లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను పంపిన తర్వాత పది మృతదేహాలు వెలికి తీయబడ్డాయని.. ఇంకా ఎవరూ చిక్కుకోలేదని తెలుస్తోందని అన్నారు. అయితే పూర్తిగా తాను దీనిని ధ్రువీకరించడం లేదని కూడా చెప్పారు.