అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చిన్న పిల్లల ఆస్పత్రిలో ఆమె కనీసం ముఖానికి మాస్క్ లేకుండా మాట్లాడటంపై ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పిల్లల నేషనల్ ఆసుపత్రిని సందర్శించిన ఆమె ఓ సమయంలో మాస్క్ తీసేశారు. దీంతో చిన్నపాటి వివాదమే తలెత్తింది. అసలే కరోనా విజృంభిస్తుంటే పిల్లల ఆసుపత్రిలో నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వస్తున్నాయి.

తొలుత మాస్క్ ధరించే మెలానియా ఆసుపత్రిలోకి వచ్చారు. అయితే ఓ చెట్టు ముందర కూర్చున్న సమయంలో మాస్కును తొలగించారు. పిల్లల కోసం ఓ హాలిడే బుక్​ ను చదివేందుకు ఆమె ఇలా చేశారు. మెలానియా పూర్తిగా భౌతిక దూరం పాటించినా.. సందర్శకులు ఎవరైనా అన్ని వేళలా మాస్కు ధరించే ఉండాలన్నది నిబంధన అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే తమ పాలసీ అని, కరోనా వ్యాప్తిని  కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆసుపత్రి పాలసీ స్పష్టం చేసింది.

మెలానియా మాస్క్ తొలగించడంపై వైట్ హౌస్ త్వరగా సమాధానమివ్వలేదు. అయితే ఆలస్యంగా స్పందించిన శ్వేతసౌధం వివరణ ఇచ్చుకుంది. ప్రసంగం ఇచ్చే సమయంలో, భౌతిక దూరం పాటిస్తే మాస్కు అవసరం లేదని కొలంబియా హెల్త్ గైడ్ లైన్స్​ లో ఉందని వైట్ హౌస్ చెప్పింది. కార్యక్రమం మొత్తం మెలానియా అందరికీ 12 అడుగులు దూరం పాటించారని పేర్కొంది.

వైట్ హౌస్ వివరణపై నేషనల్​ చిల్డ్రన్ ఆసుపత్రి ప్రతినిధి డయానా ట్రోసే మాట్లాడారు. “పిల్లల ఆసుపత్రిలో మా రోగులు, వారి కుటుంబాలు, ఉద్యోగుల రక్షణ, భద్రతే మాకు ముఖ్యం. వాషింగ్టన్ డీసీ వైద్య మార్గదర్శకాల ప్రకారం ప్రసంగించే వ్యక్తులు మాస్కులు ధరించడం కచ్చితంగా. మిగిలిన వారందరూ మాస్కులు ధరించారు’ అని చెప్పారు.