అమెరికా ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) మెలానియా ట్రంప్ ధరించిన జాకెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ ఫ్యామిలీ సెపరేషన్ విధానంలో భాగంగా టెక్సాస్ సరిహద్దులో బందీలుగా ఉన్న పిల్లలను సందర్శించేందుకు వచ్చిన ట్రంప్ సతీమణి ఓ గ్రీన్ కలర్ జాకెట్ ధరించి వచ్చింది. ఇందులో వింతేమీ లేకపోయినప్పటికీ, ఆ జాకెట్ వెనుకవైపు రాసి ఉన్న అక్షరాలు మాత్రం వివాదాస్పదంగా మారాయి.

మెలానియా ట్రంప్ ధరించిన జాకెట్ వెనుక వైపు 'ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ?' (నేను అస్సలు పట్టించుకోను, మరి మీరు) అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. వలస శిభిరాల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి రాతలున్న జాకెట్ ధరించడం ఏంటంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివిధ సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి చర్చిస్తున్నారు.

అయితే, ఈ విషయంపై మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రీషమ్ స్పందిస్తూ.. ఆ జాకెట్‌లో ఉన్న వ్యాఖ్యల్లో ఏలాంటి గూఢార్థమేమీ లేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇదంతా నకిలీ అని, బూటకు వార్తల మీడియాను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.