కొందరు రోజుకు ఒకసారి స్నానం చేస్తారు. మరికొందరు రోజుకు రెండు పూటలా స్నానం చేస్తారు. కాస్త బద్దకస్తులైతే రెండు రోజులకోసారి స్నానం చేస్తారు. అప్పటికే వారు స్నానం చేయలేదన్న సంగతి వారి శరీరం నుండి వచ్చి చెమటకంపు చెప్పకనే చెబుతుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే  అయ్యిందట. 

దీంతో ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరుగాంచాడు హాజీ. ఇతనికి ఇప్పుడు 83 ఏళ్ల వయసు. ఈ వయసు లోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌లోని దెజ్‌ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో రోజూ స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బదిందని భావించి..అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడు. 

ఎక్కువగా నాన్‌వెజ్‌ వంటకాలను ఇష్టపడే హాజీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా ఆరగించేస్తాడు. ఊరి వెలుపల ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి గ్రామస్తులే భోజనం పెడుతుంటారు. అంతేకాకుండా  ఆరు దశాబ్దాలుగా పైగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దాల్లో చూసుకుంటూ మురిసిపోతుంటాడని గ్రామస్తులు చెప్పారు. 

కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటానని, రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని హాజీ తెలిపాడు. అంతేకాకుండా తనకు పొగతాడటం అంటే చాలా ఇష్టమని, ఒకవేళ సిగరెట్‌ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగుతానని పేర్కొన్నాడు. 

ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం, అతని చుట్టు పక్కల వారినే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంది. అందుకే  ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా హాజీ రికార్డులకెక్కారు.