ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉం ఆరోగ్య పరిస్థితి పై అనుమానాలు ఉహాగానాలు, పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. కిమ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, బాగానే ఉందా లేదా అతడి ఆరోగ్యం పుకార్లలో చెప్పినట్టే నిజంగా క్షీణించిందా అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య స్థితి విషమంగా ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఆయన హృదయ సంబంధ సర్జరీ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఉత్తర కొరియా వార్తలు నేరుగా బయటకు రావడానికి అక్కడ వేరే ఏ దేశ రిపోర్టర్లను అనుమతించరు కాబట్టి అందరూ కూడా వేర్వేరు మాధ్యమాల నుండి తమకున్న కొన్ని సీక్రెట్ కాంటాక్ట్స్ నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. 

ఏప్రిల్ 15వ తేదీన ఉత్తరకొరియా ఆవిర్భావ దినోత్సవం. ఉత్తరకొరియా దేశాన్ని ఏర్పాటు చేసింది స్వయానా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ తాత. ఆ వేడుకను అత్యంత ఘనంగా, ఆడంబరంగా నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్ కి కిమ్ రాకపోవడంతో ఇక వెంటనే కిమ్ ఆరోగ్య పరిస్థితి పై అన్ని మీడియా సంస్థలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. 

ఒక్కో మీడియా సంస్థ ఒక్కో సోర్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. ముఖ్యంగా అమెరికాలోని మీడియా అమెరికా ఇంటలిజెన్స్ ఆఫీసర్ల మీద ఆధారపడి వార్తలు రాస్తే, మరికొందరు చైనాలోని కొందరు అధికారుల ద్వారా తెలుసుకుంటారు. మరికొన్ని సంస్థలు దక్షిణ కొరియాలో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా తెలుసుకుంటాయి.

కిమ్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలోనే నిన్న ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ చైనా నుంచి ఒక అధికారిక వైద్య బృందం ఉత్తరకొరియా పయనమైందని రాసుకొచ్చింది. ఈ సమయంలో చైనా ఉత్తరకొరియాకు ఎందుకు వైద్య బృందాన్ని పంపించిందని సర్వత్రా చర్చ మొదలయింది. 

ఈ అన్ని పుకార్లను పక్కనున్న దక్షిణ కొరియా మాత్రం కొట్టి పారేస్తోంది. మరికొన్ని రోజుల్లో కిమ్ పూర్తి ఆరోగ్యంతో ప్రజలకు దర్శనమిస్తాడని పేర్కొంటున్నారు. వారు ఇలా కిమ్ ఆరోగ్యం క్షీణించింది అని వస్తున్న కథనాలను కొట్టి పారేస్తూ... తమకున్న కొంత ఇంటెలిజెన్సు సమాచారం మేరకు కిమ్ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. 

ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఏమిటంటే.... కిమ్ తాత, కిమ్ తండ్రి ఇద్దరు కూడా గుండె సంబంధ వ్యాధితోనే మరణించారు. దీన్ని కూడా చూపెడుతూ మీడియా సంస్థలు కథనాలు రాయడం గమనార్హం.