అమెరికా రాష్ట్రం హవాయ్‌కు చెందిన పెద్ద దీవి కైలువా కోనాలో ఓ పెళ్లి కార్యక్రమం బీచ్‌లో జరుగుతుండగా రాకాసి అలలు పోటెత్తాయి. దీంతో ఆ పెళ్లి ఏర్పాట్లు కొట్టుకుపోవడమే కాదు.. అతిథులు పరుగు లంకించుకున్నారు. వెడ్డింగ్ కేక్ కూడా ఆ కెరటాల్లోనే కొట్టుకుపోయింది. 

Massive Waves in Hawaii: టూరిస్ట్ డెస్టినేషన్‌లలో పెళ్లి అంటే బీచ్ పార్టీలే అందరికీ గుర్తుకు వస్తాయి. ఆహ్లాదకర వాతావరణంలో వెనుక సముద్ర అలలు వచ్చి పోతుంటే ఆ వేడుకలో పాల్గొన్నవారి అనుభూతే వేరుగా ఉంటుంది. సముద్ర ముంగిట్లో ఏ వేడుక అయినా మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని మెజార్టీ ప్రజలు ఏకీభవిస్తారు. కానీ, అన్ని అనుకున్నట్టుగా జరిగితేనే అది సాధ్యం. ఎందుకు ప్రకృతిని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. ఉన్నట్టుండి ఆ రమ్యమైన అలలు రాకాసి అవతారమెత్తితే.. ఇంకేమైనా ఉందా? ఇదే పరిస్థితి ఇటీవలే ఓ నూతన వధూ వరులు ఎదుర్కొన్నారు.

ఆ దంపతులు తమ పెళ్లి జీవితాంతం అందరికీ గుర్తిండిపోయేలా ప్లాన్ చేశారు. హవాయ్ దీవిలో ఓ బీచ్‌లో వెడ్డింగ్ పార్టీ అరేంజ్ చేశారు. హవాయ్‌కి చెందిన పెద్ద దీవి కిలువా కోనాలో ఏర్పాట్లు చేశారు. అన్నీ అనుకున్నట్టుగా సాఫీగా సాగిపోతున్నాయి. కానీ, ఉన్నట్టుండి దూరంగా ఓ పెద్ద అల రావడాన్ని కొందరు గుర్తించారు. కానీ, ఆ నీళ్లు తమ కాళ్ల కిందకూ వస్తాయని వారు ఊహించలేదు. కానీ, చూస్తుండగానే ఆ అల ఉగ్రరూపం దాల్చింది. తమ పై విరుచుకుపడింది. దాని నుంచి తేరుకునేలోపలే మరో అల వచ్చి ముంచెత్తింది.

ఆ వెడ్డింగ్ పార్టీ కోసం చేసిన డెకరేషన్, టేబుల్స్, చైర్స్ అన్నీ కొటుకుపోయాయి. క్షణాల్లో అద్భుతమైన వెడ్డింగ్ సెట్.. జలమయం అయింది. వెడ్డింగ్ కేక్ కూడా ఆ అలలో కొట్టుకుపోయినట్టు తెలిసింది. చాలా మంది అలలు తమ వద్దకు వస్తుండగా పరుగెత్తారు.

Scroll to load tweet…

ఆ రాకాసి అలలు రావడం.. పెళ్లికి విచ్చేసిన అతిథులు పరుగు లంకించుకోవడం వంటి వన్నీ ఓ వీడియో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే, ఆ అలల ఉధృతి తగ్గిన తర్వాత పరిస్థితులు మళ్లీ సాధారణం అయ్యాయి. అప్పుడు ఆ జంట పెళ్లి తంతును కొనసాగించింది. విజయవంతంగా పెళ్లి చేసుకున్నారు.