సారాంశం
bomb attack: పాకిస్థాన్ లోని స్వాత్ పోలీస్ స్టేషన్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 17 మంది మరణించారని పాకిస్థాన్ స్థానిక మీడియా పేర్కొంది. స్వాత్ లోని పోలీస్ స్టేషన్ లో జరిగిన వరుస రెండు పేలుళ్లలో భవనం ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.
Explosions kill 17 in Swat Valley : పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. వరుస రెండు పేలుళ్ల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీసులు ఉన్నారు. ఈ పేలుడు ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకెళ్తే.. పాకిస్తాన్ లోని స్వాత్ లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీడీటీ) పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం జరిగిన పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ జియో టీవీ నివేదించింది.
పోలీస్ స్టేషన్ లోపల జరిగిన రెండు పేలుళ్లు భవనాన్ని ధ్వంసం చేశాయని పోలీసులు తెలిపారు. స్వాత్ ప్రావిన్స్ అంతటా భద్రతా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి కాదని, మందుగుండు సామగ్రి, మోర్టార్ షెల్స్ నిల్వ ఉన్న ప్రదేశంలో పేలుడు సంభవించిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ జియో న్యూస్ కు తెలిపారు. పోలీస్ స్టేషన్ పై ఎలాంటి దాడి, కాల్పులు జరగలేదని చెప్పారు.
పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామనీ, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ లు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు. కూలిన భవనం పాతదేనని, చాలా కార్యాలయాలు, సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ తెలిపారు. భవనం కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, దీని పరిధి ఇంకా తెలియరాలేదని తెలిపారు.
దీంతో స్వాత్ లోని ఆస్పత్రుల్లో ప్రావిన్షియల్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఎమర్జెన్సీ విధించింది. ఆత్మాహుతి దాడి జరిగిందని జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్ (డీపీవో) తెలిపారు. ఈ దాడిపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ పేలుడును ఖండించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు రేడియో పాకిస్థాన్ ను ఉటంకిస్తూ జియో న్యూస్ తెలిపింది.