అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. తాజాగా చిన్న షాపింగ్‌కు వెళ్లిన తల్లీ కొడుకులు కోటీశ్వరులుగా మారిపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన తల్లీకొడుకులు సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు.

తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండటంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే దుకాణంలో ఒక్క స్క్రాచ్ కార్డును కొన్నాడు. ఈ లోపు తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది.

ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత తాను కొనుక్కున్న స్క్రాచ్‌ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్ కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి సంబరపడిపోయాడు.

కొడుకు అరుపులు, కేకలు విన్న తల్లి ఏం జరిగిందోనన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. తన కొన్న లాటరీలో 1.4 కోట్ల రూపాయాలు వచ్చాయని చెప్పాడు. అయితే కుమారుడు చెప్పిన మాట ఆమె తొలుత నమ్మలేదు.

వెంటనే స్క్రాచ్ కార్డును తీసుకుని పరీక్షించింది. దానిపై 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లిబిడ్డల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.