ఓ వ్యక్తి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆపిల్ పండ్లు కొంటే.. ఏకంగా ఆపిల్ ఐఫోన్ వచ్చింది.

ఆన్ లైన్ లో ఒక వస్తువు కొంటే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే చూసి ఉంటారు. కొందరికైతే ఫోన్ కొంటే సబ్బు బిళ్లలు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆపిల్ పండ్లు కొంటే.. ఏకంగా ఆపిల్ ఐఫోన్ వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంగ్లాండ్ లోని ట్వికెన్ హామ్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల నిక్‌ జేమ్స్ ఈ అరుదైన జాక్‌ పాట్‌ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టనప్పటినుంచి కిరాణా సామాగ్రి నుంచి విలాస వస్తువులుదాకా దాదాపు ప్రతీదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వడం అవసరంగా మారిపోయింది. ఈ క్రమంలో బ్రిట‌న్‌లో జేమ్స్ ఆన్‌లైన్‌లో కొన్ని ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. అయితే పార్సిల్‌లో పండ్ల‌తో పాటు ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు. కానీ ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. 

అయితే టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ అని తెలుసుకుని జేమ్స్‌ను సూపర్‌ థ్రిల్‌ అయ్యాడు. విషయం ఏమిటంటే.. టెస్కో గ్రోస‌రీ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ క్యాంపేన్‌లో భాగంగా ఆపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌ను గిఫ్ట్‌గా అతనికి అందించిందన్నమాట. 'సూపర్ సబ్‌స్టిట్యూట్'లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను ఊహించని బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ.