మనసుకు నచ్చిన వ్యక్తి దొరకలేదంటూ 95 యేళ్లపాటు బ్రహ్మచారిగా ఉండిపోయాడో వ్యక్తి. చివరికి 23 యేళ్ల క్రితం పరిచయమైన ఓ 84యేళ్ల మహిళను ప్రేమించి, ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 

బ్రిటన్ : పెళ్ళికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. నచ్చిన జీవితభాగస్వామి దొరకక 95 ఏళ్ల పాటు బ్రహ్మచారి జీవితం గడిపిన వృద్ధుడు తన ఇష్టసఖి వెతుక్కుని ఇన్నాళ్లకు ఓ ఇంటివాడయ్యాడు. 23 ఏళ్ల క్రితం తనకు పరిచయం అయిన మహిళను తాజాగా పెళ్ళాడాడు. దీన్ని నమ్మలేకపోతున్నానని ఇది తనకు కొత్తజీవితంలా ఉందంటూ ఆ పెళ్లి కొడుకు సంతోషం వ్యక్తం చేశాడు. బ్రిటన్లోని కార్డిఫ్ ప్రాంతానికి చెందిన జూలియన్ మొయిలే (95) ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. నచ్చిన భాగస్వామి దొరకక ఇన్నాళ్లు పెళ్లి కాలేదు.

అయితే, 23 ఏళ్ల క్రితం ఓ చర్చిలో తారసపడ్డ మలేరియా విలియమ్స్ (84)తో అతడికి పరిచయం ఏర్పడింది. తరచూ చర్చిలో కలుసుకోవడం, ఆలోచనలు పంచుకోవడంతో ఆమెపై జూలియన్ మనసు పడ్డాడు. కానీ, ఈ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ఇన్నాళ్లపాటు సందేహించాడు. ఎట్టకేలకు ధైర్యం చేసి తన మనసులోని మాట బయట పెట్టడంతో విలియమ్స్ దీనికి అంగీకరించింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు మొదట కలుసుకున్న చర్చిలోనే ఈనెల 19న ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో మంచిది అని, దయార్థ హృదయురాలు అని పేర్కొన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తాను నమ్మలేకపోతున్నాను అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు నూతన సంవత్సరంలా ఉందని జీవితం కడవరకు ఆమె సాంగత్యాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన భర్త ఓ జెంటిల్మెన్ అని వధువు మురిసిపోయింది. మరణించేవరకు ఒకరికొకరు తోడు నీడగా ఉంటామని ఆ జంట పేర్కొంది. జులియన్ ఆస్ట్రేలియాలో హనీమూన్ ను జరుపుకోనున్నట్లు ఆ జంట తెలిపింది. 

ఇదిలా ఉండగా, మే 5న భారత్ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ లేటు వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అరుణ్ లాల్ హనీమూన్ కు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్, తాజా పెళ్లికొడుకు అరుణ్ లాల్ బెంగాల్ కు చెందిన బుల్బుల్ సాహాను మే 2న వివాహం చేసుకున్నాడు. మూడు రోజుల క్రితమే కోల్కతాలోని ఓ హోటల్ లో తన కంటే 28 యేండ్లు చిన్నదైన బుల్బుల్ సాహాను పెళ్లి చేసుకున్న అరుణ్ లాల్.. లేటు వయసులో పెళ్లే కాదు.. హనీమూన్ ను కూడా ఘనంగా ప్లాన్ చేశాడు. 

ఈ వివాహం గురించి అరుణ్ లాల్ మాట్లాడుతూ ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఇది మరో ప్రత్యేకమైన సందర్భం. నేను 
బుల్బుల్ ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. మా జీవితంలో మేము సంతోషమైన దంపతులుగా జీవిస్తాం. జీవిస్తాం. ఇక మా హానీమూన్ గురించి అందరూ చాలా ఆసక్తిగా అడుగుతున్నారు. రంజీ ట్రోఫీయే మా హనీమూన్. అక్కడే మా తదుపరి కార్యక్రమం’ అని చెప్పుకొచ్చాడు.

అరుణ్ లాల్ ఇలా చెప్పడానికి కారణం ఉంది. ప్రస్తుతం ఆయన బెంగాల్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్. ఇక రంజీ క్వార్టర్స్ కు చేరిన బెంగాల్ జట్టు.. జూన్ నాలుగు నుంచి 8 వరకు జార్ఖండ్ తో జరిగే పోరులో తలపడనుంది. బెంగళూరు వేదికగా జరుగబోయే రంజీ క్వార్టర్స్ మ్యాచుల కోసం ఆయన ఇప్పటికే జట్టును సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. అరుణ్ లాల్ మాటల్ని బట్టి చూస్తే రంజీ మ్యాచుల సందర్భంగా అతను తన రెండో భార్యతో కలిసి ప్రత్యక్షం కానున్నాడు.