రష్యా: విమానంలో పాములేంటని ఆశ్చర్యపోతున్నారా..! నిజమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పాములు. అవేవో ఎక్కడి నుంచో వచ్చినవో కాదు ఓ వ్యక్తి సంచిలో తెచ్చి అధికారులకు చుక్కలు చూపించాడు. విమానాశ్రయ అధికారులనే విస్మయానికి గురిచేసిన ఈ ఘటన రష్యాలోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే జర్మనీ నుంచి రష్యా వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న సంచిపై విమానాశ్రయ అధికారులకు అనుమానం వచ్చింది. సంచిని తనిఖీ చెయ్యగా సంచిలో 20 పాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాములను చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి వాటిని ఓ సంచిలో పేర్చి తీసుకొచ్చాడు. జర్మనీలో పాములు కొని వాటిని రష్యాకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 

పాములను కొనుగోలు చేసినదానికి సంబంధించి పత్రాలు అతను అధికారులకు చూపించడంతో జర్మనీలోని డస్సల్‌డర్ఫ్‌ విమానాశ్రయంలో అధికారులు ఆపకపోయి ఉండొచ్చని అధికారులు స్పష్టం చేశారు. అయితే జర్మనీ నుంచి పాములను రష్యాకు తీసుకెళ్లేందుకు ఎలాంటి అనుమతుల్లేవు అని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. 

మరోవైపు ఈ పాములు విషపూరితమైనవి కాదని ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. ఇలా పాములను ఓ చోట నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం జర్మనీలో నేరం కాదని ఆ దేశానికి చెందిన పోలీసులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. అయితే పాములు తరలింపు విషయంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో వచ్చేవరకు ప్రస్తుతం ఆ పాములు మాస్కోలో జంతు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు అధికారులు.