చైనాలో మాజీ భార్యను లైవ్ స్ట్రీమ్ లో పెట్రోల్ పోసి, నిప్పంటించి చంపేసిన భర్తకు ఉరిశిక్షను అమలు చేశారు.  

బీజింగ్ : ఆన్ లైన్ పోర్టల్ లో లైవ్ స్ట్రీమ్ చూస్తున్న మాజీ భార్యను హతమార్చాడు ఓ వ్యక్తి, అతనికి ఉరి శిక్ష అమలు చేశారు. చైనాలో ఈ ఘటన జరిగింది. సిచువాన్ ప్రావిన్స్ లో నివసించే టాంగ్ లూ తన భార్య లామూను నిత్యం వేధించేవాడు. దీంతో 2020 లో ఆమె అతడి నుంచి విడాకులు తీసుకుంది. అయితే తను మళ్లీ పెళ్ళాడాలని ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలోనే 2020 సెప్టెంబర్ లో ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె టిక్ టాక్ లాంటి ఆన్ లైన్ పోర్టల్ డౌయిన్ లో లైవ్ కార్యక్రమాలు చూస్తోంది.

అతడిని పట్టించుకోలేదు. దీంతో తనను పట్టించుకోవడం లేదని అతను ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని వారాల తర్వాత మరణించింది. ఈ సంఘటన చైనాలో తీవ్ర సంచలనం సృష్టించింది. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం 2021 అక్టోబర్లో అతడికి మరణశిక్ష విధించింది. ఇటీవలే అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. 

దారుణం.. నిండు గర్భిణి అయిన కోడలిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన అత్త... !

ఇదిలా ఉండగా, జూన్ 11న చైనాలోని ఒక రెస్టారెంట్‌లో మహిళల బృందంపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి మీద లైంగిక దాడి ఆరోపణలున్నాయి. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో ఓ మహిళ తన ఇద్దరు సహచరులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఒక మహిళ వీపుపై తన చేతిని వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో.. తన మీద చేయేసిన వ్యక్తిని ఆ మహిళ దూరంగా నెట్టేసింది. దీంతో కోపానికి వచ్చిన అతను తన మిగతా స్నేహితులతో కలిసి.. ఆమెను బయటకు లాగి, నేలపై పడేసి విపరీతంగా కొట్టాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన మరో మహిళను కూడా అలాగే కొట్టారు. 

ఈ వీడియో చైనాలో లైంగిక వేధింపులు, లింగ-ఆధారిత హింస గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చైనాలో పితృస్వామ్య సమాజం, ఇంటర్నెట్ సెన్సార్‌షిప్, అస్పష్టమైన చట్టపరమైన మద్దతు ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడడం బాగా పెరిగింది. అక్కడ ప్రముఖ స్త్రీవాదులు కూడా సాధారణ పోలీసు వేధింపులు, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం చైనాలో గృహహింస తగ్గుముఖం పట్టిందని.. ఈ మేరకు రిపోర్టులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు.

2018లో యూనివర్శిటీ మహిళా ప్రొఫెసర్‌ల మీద లైంగిక వేధింపుల అంశం మీద దుమారం రేగడంతో.. #MeToo ఉద్యమం తీవ్రమయ్యింది. దీంతో లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్న కీలకపదాలను వెబ్ సెన్సార్‌లు బ్లాక్ చేశాయి. హింసాత్మక దాడి, ఇబ్బందులను రెచ్చగొట్టారన్న అనుమానంతో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు టాంగ్‌షాన్ పోలీసులు తెలిపారు, మరొక అనుమానితుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది.