వెరైటీ ఆలోచనతో డబ్బు సంపాదన:బంగ్లాదేశ్ వ్యక్తిపై కేసు నమోదు
జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢాకా: వినూత్నంగా ఆలోచించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఓ వ్యక్తి ఆలోచించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంగ్లాదేశ్ లోని ఢాకా-చిట్టగాంగ్ జాతీయ రహదారిని దాటేందుకు ప్రయాణీకులు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది.
అయితే జాతీయ రహదారిపై ఉన్న బారికేడ్లను దాటేందుకు చిన్న నిచ్చెనను ఏర్పాటు చేసి ప్రయాణీకులను ఓ వ్యక్తి రోడ్డు దాటిస్తున్నాడు. అయితే ఇలా బారికేడ్ల వద్ద నిచ్చెన సహాయంతో రోడ్డు దాటిన వారి నుండి కొంత నగదు వసూలు చేస్తున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దరిమిలా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఘటన ఈ నెల 17న చోటు చేసుకుంది.
బారికేడ్లు దాటిన తర్వాత ప్రయాణీకులు నగదును ఇచ్చేందుకు అక్కడే నిలబడ్డారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడ రోడ్డుపైనే ఇదంతా జరుగుతుంది. అయితే ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మలేషియా సన్ కథనం మేరకు ఢాకా-చిట్టగాంగ్ హైవేపై నారాయణగంజ్ షిమ్రైల్ క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బారికేడ్ల వద్ద నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణీకులను రోడ్డు దాటించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.