ఆమెకు నిండా 15 సంవత్సరాలు కూడా లేవు. నా అనేవాళ్లు లేక ఒంటరిగా జీవిస్తోంది. దుబాయిలో ఉన్న బంధువు.. చదువు చెప్పిస్తానని నమ్మించడంతో.. ఆశగా రెక్కలు కట్టుకొని అక్కడికి చేరింది. తీరా అక్కడికి  చేరాకగానీ ఆ బాలిక తాను మోసపోయానని గుర్తించలేకపోయింది.

సదరు బంధువు బాలికను మసాజ్ సెంటర్లకు పంపి క్యాష్ చేసుకునేది. ఆ తర్వాత ఆమెకు మరో యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో దగ్గరై మరింత దారుణంగా మోసం చేశాడు. వ్యభిచార కూపంలోకి నెట్టాడు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది.

Also Read తల్లి ప్రేమ... పది అడుగుల విషసర్పంతో.. వడ్రంగిపిట్ట పోరాటం.. వీడియో వైరల్.

పూర్తి వివరాల్లోకి వెళితే... బంగ్లాదేశ్ కి చెందిన మైనర్ బాలిక తన బంధువు మాటలు నమ్మి దుబాయి చేరింది. చదువు చెప్పిస్తానని బాలికను దుబ్బాయి రప్పించిన ఆ బంధువు.. ఆమెను చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టింది. డబ్బుల కోసం మసాజ్ సెంటర్లకు పంపేది.

ఆ పనిచేయడం ఇష్టం లేని బాలిక.. వెళ్లనని మొండికేసి కూర్చుంది. దీంతో.. ఆ బంధువు మరో క్రూరమైన ప్లాన్ వేసింది. ఓ యువకుడిని ఇంట్లోకి దింపింది. ఆ యువకుడు తొలుత బాలికకు ప్రేమ పేరిట పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఓ రోజు బయటకు తీసుకువెళ్లి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు.

స్పృహ కోల్పోయిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించాడు. బాలిక సంపాదనతో తన జల్సాలు తీర్చుకునేవాడు. కాదు, కూడదు అని బాలిక మొరాయిస్తే.. ఆమెను బెల్ట్ తో కొట్టి దారుణంగా ప్రవర్తించేవాడు. కనీసం తినడానికి తిండి కూడా పెట్టేవాడు కాదు. 

ఈ వేధింపులు భరించలేపోయిన బాలిక.. వేరే యువతి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. వారి సహాయంతో.. తన ప్రేమ పేరిట మోసం చేసిన యువకుడిని, బంధువును పోలీసులకు అప్పగించింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.