ఆఫ్రికా దేశం నైగర్‌ను వదిలిపెట్టి వచ్చేయాలని నైగర్‌లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అక్కడ ఉండాల్సిన అవసరం లేనివారు వెంటనే ఆ దేశం వదలిపెట్టాలని కోరారు. భారత్ నుంచి వెళ్లానుకునేవారూ పునరాలోచన చేయలని తెలిపారు. 

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశమైన నైగర్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అధ్యక్షుడు బజౌమ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నైగర్ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ ఉండాల్సిన అవసరం లేనివారు వెంటనే దేశం వదిలి రావాలని సూచించింది.

నైగర్ గగనతలాన్ని మూసేసిన విషయాన్ని ఆ దేశంలోని భారతీయులు గుర్తు పెట్టుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కాబట్టి, సరిహద్దు గుండా బయటకు రావాల్సి ఉంటుందని, ఆ సమయంలో అన్ని విధాల రక్షణను దృష్టిలో పెట్టుకోవాలని వివరించారు. అలాగే, నైగర్ వెళ్లానుకుంటున్న భారతీయులు పునరాలోచన చేయలని సూచించారు. నైగర్ దేశంలో సుమారు 250 మంది భారతీయులు ఆ దేశంలో చాలా చోట్లకు వ్యాపించి ఉన్నారని తెలిపారు.

దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ ఎంబసీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటికీ ఇంకా పేరు నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేసుకోవాలని బలంగా కోరారు.

Also Read: అన్న డ్రగ్స్‌కు అలవాటయ్యాడు.. డిప్రెషన్‌తో చెల్లి ఆత్మహత్య.. ఎందుకంటే?

ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత పలుమార్లు నైగర్‌లో ప్రభుత్వాలపై తిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లు ప్రజల జీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా జులై 26వ తేదీన నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ పై జనరల్ అబ్దౌర్ రహ్మనే చియానీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ తిరుగుబాటును ప్రజలు ఆమోదించడం లేదు. పలువురు మాజీ సాయుధులు కూడా తిరుగుబాటును వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.