Late Night Protest: కొలంబోలోని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇంటి సమీపంలోని రహదారిపై ప్రజలు పెద్ద ఎత్తున‌ గుమిగూడి.. ఆందోళ‌న‌కు చేశారు. ప్ర‌స్తుత‌ పరిస్థితిలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మ‌రింత‌గా ముదురుతోంది. ఇప్ప‌టికే దేశంలోని నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొలంబోలో వారాల తరబడి భయంకరమైన ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు గురువారం సాయంత్రం దాటిన త‌ర్వాత నిరసనల‌కు దిగారు. దాదాపు 2000 మందికి పైగా ప్రజలు ఆయన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ శ్రీ‌లంక రాజధానిలో అధ్యక్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే ఇంటి దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు అడ్డుకోవ‌డంతో ప‌రిస్థితులు ఉద్ర‌క్తంగా మారాయి. ఈ క్ర‌మంలోనే తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ఆందోళ‌న‌కారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. దీంతో నిరసనలను అణిచివేసేందుకు పారామిలటరీ పోలీసు యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ప్ర‌భుత్వం రంగంలోకి దించింది. 

శ్రీ‌లంక స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యంతో పోరాడుతోంది. కొన్ని వారాల నుంచి ఆహారం, అవసరమైన వస్తువులు, ఇంధనం, గ్యాస్‌ల కొరత తీవ్రంగా ఉంది. ఇక గురువారం నుంచి దేశంలో డీజిల్ అందుబాటులోకి లేకుండా పోయింది. దాదాపు దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలు 13 గంటల విద్యుత్ బ్లాక్‌అవుట్‌లోకి జారుకున్నారు. రోడ్లపై లైట్ల‌ను నిలిపివేశారు. ఔషధాల కొరత కారణంగా ఇప్పటికే శస్త్రచికిత్సలను నిలిపివేసిన ప్రభుత్వ ఆస్పత్రులపై బ్లాక్‌అవుట్ ప్రభావం చూపింది.

విద్యుత్ స‌ర‌ఫ‌రా అంత‌రాయం.. రేషన్‌, మొబైల్ ఫోన్ బేస్ స్టేషన్‌లను తాకింది. దీంతో కాల్‌ల నాణ్యత తీవ్రంగా ప్ర‌భావితం అయింది. కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను సగం నుండి రెండు గంటల వరకు పరిమితం చేయాల్సి వచ్చింది మరియు కార్యాలయాలు అనవసరమైన సిబ్బందిని ఇంట్లోనే ఉండమని కోరాయి. విద్యుత్‌ను ఆదా చేసేందుకు వీధి దీపాలు ఆపివేయబడుతున్నాయని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇంటి సమీపంలోని రహదారిపై గుమిగూడారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నిన‌దించారు. ప్ల‌కార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో గొడవ మొదలైంది. ఆందోళ‌న‌కారులు పోలీసులపై బాటిళ్లు, రాళ్లు విసిరారు. నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావ‌డానికి టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగుల‌ను ప్ర‌యోగించారు. 

బైక్‌పై వచ్చిన ఇద్దరు పోలీసులను గుంపు చుట్టుముట్టిన దృశ్యాలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. అలాగే, నిర‌స‌న‌కారులు అద్దాలు పగులగొట్టడం, రాళ్లు రువ్వ‌డం, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం వంటి దృశ్యాల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చెస్తున్నాయి. ఆందోళ‌న‌కారులు పోలీసు బస్సుకు నిప్పు కూడా పెట్టారు. అయితే, నిరసనల సమయంలో రాజపక్సే ఇంట్లో లేరని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది.కాగా, మార్చి 2020లో దిగుమతులను నిషేధించే లంక ప్రభుత్వ చర్యలో ప్రస్తుత సంక్షోభానికి సంబంధించిన కార‌ణాలు దాగున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చర్యలు ప్రభుత్వం $51 బిలియన్ల రుణం కోసం విదేశీ కరెన్సీని ఆదా చేయడానికి ఉద్దేశించబడింది. అయితే దీంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోవ‌డానికి కార‌ణ‌మైది. 

ప్ర‌స్తుతం నెల‌కొన్న ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి బెయిలౌట్‌ను కోరుతున్నట్లు శ్రీ‌లంక‌ ప్రభుత్వం తెలిపింది. భారత్‌, చైనాల నుంచి కూడా రుణాలు మంజూరు చేయాలని కోరింది.