New York: భార‌త సంత‌తి మ‌హిళ‌, బాబ్సన్ కాలేజీలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీ బాలచంద్ర.. అమెరికాలో జాతి వివక్షకు గుర‌య్యారు. దీని  కార‌ణంగా  తన వృత్తి అవకాశాలను కోల్పోయారనీ, ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభ, తన ప్రతిష్ఠకు హాని కలిగించారని ఆరోపించినట్లు బోస్టన్ గ్లోబ్ వార్తాపత్రిక నివేదించింది.  

Indian-origin professor Lakshmi Balachandra: మసాచుసెట్స్‌లోని వెల్లెస్లీ బిజినెస్ స్కూల్లో భారత సంతతికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ తాను జాతి, లింగ వివక్షకు గురయ్యానని ఆరోపిస్తూ దావా వేశారు. అమెరికాలో జాతి వివక్షకు గుర‌య్యారు. దీని కార‌ణంగా తన వృత్తి అవకాశాలను కోల్పోయారనీ, ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభ, తన ప్రతిష్ఠకు హాని కలిగించారని ఆరోపించినట్లు బోస్టన్ గ్లోబ్ వార్తాపత్రిక నివేదించింది. వివక్ష కారణంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందనీ, ఆర్థికంగా నష్టపోవ‌డంతో పాటు మానసికంగా కుంగిపోయానని ల‌క్ష్మీ బాల‌చంద్ర ఆందోళన వ్యక్తంచేసిన‌ట్టు వార్తాపత్రిక కథనం వెల్లడించింది.

సంబంధిత వివ‌రాల ప్ర‌కారం.. ల‌క్ష్మీ బాల‌చంద్ర 2012లో బాబ్సన్‌ కళాశాలలో ఉద్యోగినిగా చేరారు. 2019 వ‌ర‌కు అందులోనే కొన‌సాగారు. అయితే, ఆమె తన దావాలో అప్ప‌టికే అందులో ప‌నిచేస్తున్న‌ ప్రొఫెసర్- కళాశాల వ్యవస్థాపక విభాగం మాజీ చైర్మన్ ఆండ్రూ కార్బెట్ ను త‌న‌ను వివ‌క్ష‌కు గురిచేశార‌ని ఆరోపించారు. వివక్షాపూరిత పని వాతావరణం క‌ల్పించార‌నీ, అత‌నిపై దావా వేశారు. ఫిబ్రవరి 27న బోస్టన్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. టీచింగ్ అసైన్మెంట్లు, క్లాస్ షెడ్యూలింగ్, వార్షిక సమీక్షలను పర్యవేక్షించిన కార్బెట్, ఎలక్టివ్ ల‌ను బోధించాలని ఆమె అభ్యర్థనలు ఉన్నప్పటికీ వాటిని వ‌ద్ద‌ని చెప్పేవాడ‌ని పేర్కొన్నారు. త‌న‌కు అనుభవమున్న, పట్టున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పాఠ్యాంశాలను బోధించమని ఒత్తిడి చేశార‌ని ఆరోపించారు. ఆమె గతంలో ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఇటువంటి తరగతులను బోధించిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన్య‌త ఉన్న అంశాల‌ను బోధించ‌కుండా అడ్డుకున్నార‌ని పేర్కొన్నారు.

బాబ్సన్ లో శ్వేతజాతి, పురుష అధ్యాపకులకు అధిక ప్ర‌ధాన్య‌త ఇస్తూ ఇత‌రుల ప‌ట్ల వివ‌క్ష‌ను చూపుతున్నార‌నీ, వారికి మాత్ర‌మే ప్రధాన అవార్డులు, సౌకర్యాలు కల్పిస్తారని బాలచంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరిశోధనా రికార్డు ఉన్నప్పటికీ, ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ, కళాశాలకు సేవలందించినప్పటికీ త‌గిన విలువ ఇవ్వ‌లేద‌నీ, ఉన్నతస్థానాలకు వెళ్లకుండా అడ్డుకున్నార‌నీ, దీని కార‌ణంగా తాను అనేక వృత్తి అవ‌కాశాల‌ను కోల్పోయాన‌ని తెలిపారు. ఇక్క‌డ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ విభాగంలోని శ్వేతజాతి పురుష అధ్యాపకులకు ఇలాంటి అధికారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలచంద్ర తరపు న్యాయవాది మోనికా షా మాట్లాడుతూ ప్రొఫెసర్ మసాచుసెట్స్ కమిషన్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ లో వివక్ష అభియోగం కూడా దాఖలు చేశారని తెలిపారు. 

ఈ అంశంపై బాబ్సన్ కాలేజ్ స్పందించింది. ఆందోళనలు లేదా ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తామనీ, వాటిని క్షుణ్ణంగా పరిశోధించడానికి, పరిష్కరించడానికి బాగా స్థాపించబడిన ప్రోటోకాల్స్-వనరులను కలిగి ఉందని తెలిపింది. క్యాంపస్ లోని అన్ని కోణాల్లో సమానత్వం, చేరికలకు విలువనిచ్చి, సమ్మిళితం చేసే వైవిధ్యమైన ప్రపంచ సమాజానికి ఈ కళాశాల నిలయమనీ, ఇక్కడ ఎలాంటి వివక్షను సహించబోమని బాబ్సన్ కాలేజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ప్రస్తుతం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లో ఫెలోషిప్ కోసం సెలవులో ఉన్న బాలచంద్ర త‌న‌కు నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు సమాచారం.