భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలబెడుతూ.. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కమలా హారిస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోదరి మాయ హారిస్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.

‘‘ తమ తల్లి ఎవరో తెలియకుండా కమలా హారిస్ మీకు తెలియదు. కానీ ఈ రోజున తన తల్లి, మా పూర్వీకులు తప్పకుండా హర్షం వ్యక్తం చేస్తున్నారని మాయా ట్వీట్ చేశారు. అలాగే తల్లితో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేశారు.

అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా- అమెరికన్ మహిళగా, చరిత్రలో రెండో నల్లజాతి మహిళగా కమలా హారిస్ ఇప్పటికే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా చరిత్రలో అధ్యక్ష టిక్కెట్లలో ఒకదానికి ఎంపికైన నాల్గవ మహిళగా కమల చరిత్ర సృష్టించారు.

1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా పార్టీల ఓటమి కారణంగా వారు విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్యక్ష పదవి అలంకరించే తొలి మహిళగా కమలా హారిస్ నూతన అధ్యాయం లిఖించే అవకాశం వుంది.